* ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సీఎం రేవంత్ పాలనపై మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి ఫైర్ అయ్యారు. రైతులకు ఇచ్చిన హామీల అమలు తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఏం చేశారని, రైతుల భూమి హక్కులు వంద శాతం కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. కాంగ్రెస్ సర్కారు తీరుతో మీ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా? ప్రశ్నించారు. భూ రికార్డులు సరి చేస్తామని, రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం మీదని ధ్వజమెత్తారు. ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి? రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు.
