– అభినందించిన ప్రధాని మోడీ
ఆకేరు న్యూస్, కమలాపూర్: మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ట్రోఫీని రెండోసారి భారత మహిళల కబడ్డీ జట్టు సొంతం చేసుకుంది. నిన్న ఢాకా షహీద్ సుహ్రవర్దీ లో జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీని 35–28తో ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కబడ్డీ టోర్నీ చరిత్రలో వరుసగా రెండో టైటిల్ (2012, 2025) సాధించిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. రైడర్ పూజ ఆధ్వర్యంలో భారత్ రైడ్లు ధాటిగా సాగగా, చైనీస్ తైపీ డిఫెన్స్‌ను ఛిన్నాభిన్నం చేశాయి. మ్యాచ్ చివరి నిమిషాల్లో ఆలౌట్ చేసి భారత్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్ కబడ్డీ కప్‌లో కూడా భారత పురుషులు, మహిళలు రెండూ బంగారు పతకాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. రాబోయే 2026 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. కాగా మహిళల ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్, మహిళల ప్రపంచ అందుల T20 వరల్డ్ కప్, తాజాగా మహిళల కబడ్డీ ప్రపంచ కప్ గెలుసుకోవడంతో దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అభినందించిన ప్రధాని మోడీ
దేశం గర్వపడేలా చేశారని, భారత మహిళా కబడ్డీ జట్టుకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. మహిళల కబడ్డీ జట్టు అత్యుత్తమ ధైర్యాన్ని, నైపుణ్యాలను, అంకితభావాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ఈ విజయం దేశ యువత కబడ్డీని ఆడటానికి తద్వారా, గొప్ప లక్ష్యాలను సాధించడానికి ప్రేరణను ఇస్తుందని సామాజిక వేదిక ఎక్స్ లో తెలిపారు.
………………………………………………….
