* రెండని చెప్పి ఒకటే చీరిచ్చిన నీకు మహిళలు ఓట్లేయ్యాలా?
* 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగ్గొడుతున్నసర్కారు
* మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
ఆకేరు న్యూస్, సిద్దిపేట : ఎన్నికలు లేవు కాబట్టే పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు రేవంత్ సర్కారు చీరలు ఇవ్వడం లేదని, సర్కారువన్నీ ఎన్నికల స్టంట్లేనని మాజీ మంత్రి, సిద్ది పేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harishrao) విమర్శించారు. గ్రామీణ మహిళలకు కూడా రెండు చీరలని చెప్పి ఒకటే ఇచ్చారని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు ఈమేరకు మాట్లాడారు. మహిళల హామీలు నెరవేర్చని కాంగ్రెస్ సర్కారుకు మహిళలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ (Kcr Government) హయాంలో 18 ఏళ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరలు అందించారని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తుచేశారు. చీర ఇచ్చాను.. సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్ళంత ఓట్లు గుద్దుండ్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తానన్న నెలకు రూ. 2500 సంగతి ఏందని ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగ్గొడుతుందని అన్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క మహిళా సంఘాలకి ఒక్క బస్సు కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు.
………………………………………………
