ఆకేరు న్యూస్, తిరుమల : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ఇందుకోసం ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపట్టారు. ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించిన అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ ఏడాది పద్మావతి అమ్మవారికి రూ.1.30 కోట్లు విలువైన 1071 గ్రాముల బంగారు కమలముల హారం, 68 గ్రాముల వజ్రాల అడ్డిగ ఆభరణాలను తయారు చేయించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పంచమి తీర్థం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సారెతో పాటు ఆభరణాలను కూడా సమర్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, ప్రశాంతి, జానకి దేవి, రంగశ్రీ, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
………………………………..
