* వైసీపీ ఎమ్మెల్యే కోసం కొనసాగుతున్న గాలింపు
* టీడీపీ చలో మాచర్ల
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మాచర్ల పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆయన కోసం నిన్న హైదరాబాద్ లో గాలించిన ఏపీ పోలీసులకు ఆయన చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక దేశం విడిచిపోతారన్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక మాచర్ల ఘటన నేపథ్యంలో పోలింగ్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పీవోను సస్పెండ్ చేశారు. ఈవీఎం ధ్వంసం సమయంలో అడ్డుకునే ప్రయత్నంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకున్నారు. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలంటూ పీవోను ఈసీ ఆదేశించింది.
టీడీపీ చలో మాచర్ల.. ఉద్రిక్తం
ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. అయితే చలో మాచర్లకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. టీడీపీ పిలుపు నేపథ్యంలో మాచర్ల పట్టణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. 144 సెక్షన్ అమల్లో ఉందంటున్న పోలీసులు.. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసి.. బ్రహ్మరెడ్డి, నక్కా ఆనందబాబు, జీవీని హౌస్ అరెస్ట్ చేశారు. జూలకంటి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. మాచర్లకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో మాచర్లలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
—————————-