* మరో ఉద్యమానికి శ్రీకారం.. ఐక్య కార్యాచరణ వేదిక ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపేలా కొత్త రైల్వే లైను కోసం ఓ ఉద్యమం మొదలైంది. ఎప్పటి నుంచో ఉన్న ఆ డిమాండ్ సాధన కోసం ఇప్పుడు ఉధృతమైంది. అందుకోసం రెండు రాష్ర్టాలకు చెందిన కొంత మంది ఐక్య కార్యాచరణ వేదికగా ఏర్పడి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వియ్ వాంట్.. మధిర-గుడివాడ రైల్వేలైన్ అంటూ తమ నినాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గుడివాడ వరకు కొత్త రైల్వే లైను ఏర్పాటు చేయాలని ఐక్య కార్యాచరణ వేదిక కొంతకాలంగా పోరాడుతోంది. తాజాగా ఐక్యవేదిక నాయకులు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావుని గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. బందరు పోర్టుతో అనుసంధానమయ్యే ఈ కొత్త రైల్వేలైన్తో ఎగుమతి, దిగుమతుల్లో తెలంగాణకు లబ్ది చేకూరుతుందని, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని మెట్ట ప్రాంతాల అభివృద్థికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంతో విజయవాడ జంక్షన్ మీద కూడా ఒత్తిడి తగ్గుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ రైలు మార్గం కోసం చేపట్టాల్సిన సర్వేకై రానున్న కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేలా చూడాలని రామచందర్ రావును కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి కొత్త రైల్వేలైను మంజూరు కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని ఐక్య కార్యాచరణ వేదిక నాయకులకు రామచంద్రరావు హామీ ఇచ్చారు.
………………………………………….
