* మహ మహానగరం శ్రీకారంతో మరింత దూకుడు
* ఊహించని అభివృద్ధికి చాన్స్ అంటున్న నిపుణులు
* మారిపోనున్న పూర్తి భౌగోళిక స్వరూపం
* మున్ముందు భూమి ధరలకు రెక్కలు
ఆకేరున్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచలోనే గుర్తింపు పొందిన నగరాల్లో ఒకటి. ఓ నివేదిక ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అంతేకాదు చాలా ఖరీదైన నగరంగానూ ప్రాచుర్యం పొందింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లు రికార్డ్ ధర పలికాయి. ఎకరం ధర అక్షరాలా 137 కోట్లా 25 లక్షలు పలికింది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా, అందులో ఎకరం 136 కోట్ల 50 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. ప్లాట్ నెంబర్ 18లో ఎకరం ధర 137 కోట్ల 25 లక్షలు పలికింది. మొత్తంగా 9.90 ఎకరాలకు రూ.1,355 కోట్ల ఆదాయం సమకూరడంతో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.
హైదరాబాద్ కేంద్రంగా..
ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద మెట్రో నగరంగా అవతరించింది. 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ ఎంసీలో విలీనం చేసింది. ఇప్పుడు ఒకటిగానే ఉంచుతుందా.., బహుళ కార్పొరేషన్లుగా ఉంచుతుందా.. అనే ప్రశ్నలను పక్కనపెడితే.. అభివృద్ధి పరంగా మరో మార్క్ చేరే అవకాశాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా అన్ని రంగాలూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.
పెట్టుబడులకు కేంద్ర బిందువుగా..
ఫార్మా రంగానికి కేరాప్ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్, ఆ తర్వాత ఐటీ రంగంలో బెంగళూరును మించి దూసుకుపోతోంది. పర్యాటకం, బయోటెక్నాలజీ, ఇతర వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న హైదరాబాద్, ఆధునికంగా హైటెక్ హంగులతో ఇతర మెట్రో నగరాలను మించి వృద్ధి చెందుతోంది. దేశంలోనే ఏ మెట్రో నగరంలో లేనన్ని హైరైజ్ భవనాలు (ఆకాశహార్మ్యాలు-30 నుంచి 60 అంతస్తుల వరకు) హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్‌తో పాటు గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారింది. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు కేంద్ర బిందువైంది. ఇప్పుడు తన స్థానం మరింత ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు బలపడుతున్నాయి.
ప్రత్యేకతల నిలయం
హైదరాబాద్ మరో ప్రత్యేకత ఏంటంటే.. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే విద్య, ఉద్యోగ రంగాల్లో తక్కువ వ్యయం ఇక్కడ. అందుకే ఇతర దేశాలకు చెందిన వారు కూడా వైద్య చికిత్స, విద్య కోసం మహానగరానికి తరలివస్తున్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి వస్తుండడంతో హైదరాబాద్‌లో పది నుంచి పన్నెండు భాషలు మాట్లాడే వారంతా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఉన్న నగరాన్ని దేశ రెండో రాజధానిగానూ చేసేందుకు అవకాశం ఉందన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
నివేదిక ప్రకారం..
ఇటీవల విడుదలైన ‘సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ – 2024’ నివేదికలో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో కర్ణాటక రాజధాని బెంగళూరు మొదటి స్థానంలో, వియత్నాం దేశంలోని హో చి మిన్ సిటీ రెండో స్థానంలో, దేశ రాజధాని న్యూ ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ – 2024 ప్రకారం, ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో ఆసియా ఖండం కీలక పాత్ర పోషిస్తోంది. 2033 నాటికి ఏఏ నగరాలు అత్యంత సమర్థవంతమైన అభివృద్ధిని సాధిస్తాయో అంచనా వేస్తూ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో ఆర్థిక స్థాయి, జనాభా పెరుగుదల, వ్యక్తిగత సంపద వంటి పలు అంశాలను ప్రమాణాలుగా తీసుకున్నారు. సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్‌తో పాటు సావిల్స్ రెసిలియంట్ సిటీస్ ఇండెక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలపై అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనంలో హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ప్రపంచంలోనే మెరుగైన సిటీగా ఉందనే విషయం తేలినట్లు స్పష్టమైంది. ఇప్పుడు అతిపెద్ద నగరం ఆవిర్భావంతో మరింత ముందుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
………………………………………………..
