* నిజాంసాగర్ ప్రాజెక్టు పూడికతీతను చేపట్టాలి
* మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత కామెంట్స్
ఆకేరు న్యూస్, కామారెడ్డి : కాళేశ్వరం ఓ అద్భుద ప్రాజెక్టు..కాళేశ్వరం నీళ్లలో రైతుల కన్నీళ్లు తీరుతాయని అనుకుంటే.. నిజామాబాద్, కామారెడ్డికి ఆ ప్రాజెక్టుతో ఫలితం లేకుండా పోయిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు. కామారెడ్డిలో పర్యటించిన కవిత మీడియాతో మాట్లాడారు. మొంథా తుఫానుతో జిల్లాలో పత్తి రైతులు నష్టపోయారని చెప్పుకొచ్చారు. జుక్కల్ ప్రాంతంలో జిన్నింగ్ మిల్ను ఏర్పాటు చేయాలని కోరారు. జిన్నింగ్ మిల్ కోసం జాగృతి పోరాటం చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతికి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. కాళేశ్వరంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు నీరు రాకపోగా.. ఈ ప్రాజెక్టులో మాజీ మంత్రి హరీష్రావు అవినీతికి పాల్పడ్డారని.. ఆయనతోనే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు అవినీతి మరక అంటుకుందని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి యువత రావాలి..
యువత నేటితరం రాజకీయాల్లోకి రావాలని కవిత సూచించారు. రాష్ట్రాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. సర్పంచ్ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి ఆయా సమస్యలపై పార్టీలను ప్రశ్నించాలని సూచించారు. రోడ్ల కోసం ఆందోళన చేస్తుంటే జుక్కల్ ఎమ్మెల్యే యువకుల మీద కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. యువతపై నమోదైన కేసులను రేవంత్రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడితే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కొందరు గొర్రెల కోసం డీడీలు కట్టారని.. అప్పుల పాలైనా నేటికీ గొర్రెలను పంపిణీ చేయలేదని.. అర్హులైన వారికి వెంటనే గొర్రెలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
……………………………………………..
