* రౌడీల్లో మార్పునకు యత్నం
* అర్ధరాత్రుళ్లు ఇళ్లకు వెళ్లి మరీ క్లాస్
* ఆర్టీసీ వలే కొత్త తరహా సంస్కరణలు
* మార్పు మొదలయ్యేనా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన వీసీ సజ్జనార్ మరోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ చర్చనీయాంశంగా మారారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ఆయన పాలనా తీరు కూడా చర్చనీయాంశం అవుతూనే ఉంది. విభిన్న నిర్ణయాలు తీసుకుంటూ పోలీసుశాఖను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. హైదరాబాద్‌లో నేరాలు తగ్గించేందుకు వినూత్న పంథాలో ముందుకెళ్తున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో నష్టాల్లో సంస్థను లాభాల బాటలో పయనించేలా చేసేందుకు విశేషంగా కృషి చేశారు. కీలక చర్యలు చేపట్టి నష్టాలను తగ్గించగలిగారు. పోలీస్ కమిషనర్ గా ఉన్న ఆయన ఇప్పుడు అదే రీతిలో హైదరాబాద్‌లో క్రైం రేటు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
సంచలనాలకు మారు పేరు
ఐపీఎస్ సజ్జనార్.. ఓ పోలీసు అఫీసర్‌గా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ముద్ర. సంచలనం సృష్టించిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ యువతులపై యాసిడ్ దాడి, హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశా రేప్.. ఈ రెండు కేసుల్లో ఆయన హయాంలో ఏడుగురు నేరస్తులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఆర్టీసీలో ఆయన చేపట్టిన సంస్కరణలన్నీ సత్ఫలితాలను ఇచ్చాయి. చర్యలు, సంస్కరణలతో నష్టాలను బాగా తగ్గించగలిగారు. ప్రైవేట్ రవాణా వ్యవస్థకు ధీటుగా ఆర్టీసీని నిలిపారు. 100 డేస్ ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ పేరుతో ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరేలా చేశారు. ఆర్టీసీ ప్రయాణికులకు తిరుపతి వెంకన్న దర్శనం కల్పించారు. ఈ నిర్ణయం ఆన్ లైన్ లో ఆర్టీసీ టికెట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఉన్న వనరులను వినియోగించుకుని, ఆర్టీసీని గాడిలో పెట్టారు. తనదైన మార్క్ చూపారు.
మరోసారి తనదైన మార్క్
ఇప్పుడు పోలీసు శాఖలో కూడా మరోసారి తన మార్క్ చూపిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు శాఖ దర్యాప్తు ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నగరంలో సంచలనం సృష్టించే, కీలకమైన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సీఐటీ)ను ఏర్పాటు చేసేందుకు పోలీస్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త బృందం ఏర్పాటుతో ముఖ్యమైన కేసుల దర్యాప్తు వేగవంతం కానుంది. ప్రస్తుతం అన్ని రకాల కేసులను స్థానిక పోలీస్ స్టేషన్లు, ఇతర విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే, సీఐటీ ఏర్పాటు ద్వారా సాధారణ కేసులతో సంబంధం లేకుండా కేవలం సంచలనాత్మక కేసులపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఇది దర్యాప్తులో జాప్యాన్ని నివారించి, నాణ్యతను పెంచుతుందని పోలీసు శాఖ అంచనా వేస్తోంది.
రౌడీషీటర్ల లో మార్పు..
ముందస్తు సమాచారం లేకుండా, ఎలాంటి సైరన్లు మోగించకుండా.. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆషమ్నగర్, డిఫెన్స్ కాలనీలోని అనేకమంది రౌడీషీటర్ల ఇండ్లకు సీపీ సజ్జనార్ అర్ధరాత్రి వెళ్లారు. వారి గత ప్రవర్తన, ప్రస్తుతం వృత్తి జీవనశైలి గురించి ఆరా తీశారు. వారు తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలని, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించారు. మరోవైపు వ్యాపార సముదాయాలు అనుమతి పొందిన సమయానికి మించి పనిచేయకూడదని హెచ్చరించారు. అంతేకాదు..వారిలో మార్పు నకు ప్రయత్నించారు. తద్వారా నగరంలో నేరాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో సజ్జనార్ మార్క్ నగరంలో క్రైం రేటు తగ్గించేందుకు దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మున్ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారో వేచి చూడాలి.
…………………………………………..
