* ముగ్గురు ఉమ్మడి మహబూబ్నగర్ వాసుల అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సీబీఐ, పోలీసు అధికారుల పేరు చెప్పి బాధితులను బెదిరించి దోచుకుంటున్నారు. చట్టంలో అలాంటి అరెస్టులు లేవని ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా, డిజిటల్ అరెస్ట్ (Digital Arrest) పేరుతో ఎవరైనా బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండని చెబుతున్నా మోసపోతూనే ఉన్నారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరిట చేసిన మోసం చేసిన కేసులో ముగ్గురిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా (Mahaboobnagar District) కు చెందిన పండు వినీత్ రాజ్, తిరుపతయ్య, విశ్వనాథం డిజిటల్ అరెస్టు పేరుతో చాగంటి హనుమంతురావు అనే వ్యక్తిని బెదిరించి ఏకంగా రూ.1.92 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. సీబీఐ అధికారుల పేరిట బాధితుడిని నమ్మించి భయపెట్టి మోసగించారు. నిందితుల్లో పండు వినీత్ రాజ్ సైబర్ నేరగాళ్ల(Cyber Criminals)కు బ్యాంకు ఖాతాలు సమకూర్చినట్లు గుర్తించారు. నేరగాళ్ల బ్యాంకు ఖాతాలకు జాయింట్ హోల్డర్లుగా తిరుపతయ్య, విశ్వనాథం వ్యవహరించారు. నిందితులపై దేశ వ్యాప్తంగా ఐదు కేసులు, రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సందీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
…………………………………..
