* ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ చురక
* శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రతి పక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీహార్ ఓటమి నుంచి ఇంకా ప్రతిపక్షాలు కోలుకోలేదని ఎద్దేవా చేశారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సూచించారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు.విలువైన పార్లమెంట్ సమావేశాల కాలాన్ని వృథా చేయకుండా సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధి దేశ భవిష్యత్ కోసం ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. బిల్లులపై చర్చలలో పాల్గొని ప్రభుత్వానికి కావాల్సిన సూచనలు అందించాలని కోరారు.అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నానని అన్నారు. మీ బాధ్యతను మీరు నిర్వర్తించండంటూ ఆయా పార్టీలకు ప్రధాని హితవు పలికారు. పార్లమెంటులో బలమైన అంశాలతోపాటు ప్రశ్నలు లేవనెత్తండంటూ వారికి కీలక సూచన చేశారు.సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయి. సెలవు రోజులు మినహా మొత్తం 15 రోజులపాటు ఈ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందనున్నాయి.
………………………………………….
