* దివ్యాంగులను ఆదరించాలి
* మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, హనుమకొండ : అంగ వైకల్యంతో పుట్టడం తప్పు కాదని వారిని ఆదరించి ప్రోత్సహించాలని మాజీ మంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ లోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల వారోత్సవాలకు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ అంగవైకల్యంతో పుట్టడం పిల్లల తప్పు కాదని అలాంటి పిల్లలను సమాజంలో చిన్న చూపు చూడటం మంచిది కాదని తెలిపారు. అంగవైకల్యం కలిగిన పిల్లలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాదాపు 200మంది మానసిక వికలాంగ పిల్లలకు మల్లికాంబ మనోవికాస కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. మల్లికాంబ మనోవికాస కేంద్రానికి నావంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. పిల్లల ఆరోగ్యం పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ వారితో మాట్లాడి ఇక్కడికే వచ్చి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసే విధంగా చూస్తానని తెలిపారు. ఈ సంక్రాతి పండుగకు మల్లికాంబ మనోవికాస కేంద్రంలోని పిల్లలందరికి కొత్త యూనిఫామ్స్ అందిస్తానని, సంక్రాతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలతోనే జరుపుకుంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మల్లికాంబ మనివికాస కేంద్రం నిర్వాహకురాలు రామలీల, జాయింట్ సెక్రెటరీ ప్రొఫెసర్ పద్మ, ఈసి మెంబర్ బండ సదానందం, కళ్యాణ్, సిబ్బంది, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
