గత పుణ్యం వల్లే తల్లులకు సేవ చేసే అదృష్టం దక్కింది.
మేడారం పూజారులతో సమావేశం.
జిల్లా ఎస్ పి సుధీర్ రామనాథ్ కేకాన్.
ఆకేరు న్యూస్, ములుగు:
జనవరి 2026 నెల చివరి వారంలో నిర్వహించనున్న మేడారం మహా జాతర విజయవంతం కోసం, సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల పూజారులు, కన్నెపల్లి ,మేడారం, యూత్ సభ్యులతో సమన్వయ చర్యలపై బుధవారం జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇది మన జాతర… అందరం ఒక జట్టు లా కలిసి పనిచేస్తేనే జాతర విజయవంతం అవుతుందని, గత పుణ్యం వల్లే ఈ జాతర లో తల్లులకు సేవ చేసే అదృష్టం మనందరికీ లభించింది అని అన్నారు.
. సమన్వయం – భద్రతపై కీలక సూచనలు.
పూజారులు, యువత కోసం ప్రత్యేక పాసులు జారీ చేసి పూజారులు, యువత, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం లేకుండా కృషి చేస్తానని సూచించారు.
ఈ సంవత్సరం మేడారం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతుండటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు ఇందుకోసం 10,000 మందికి పైగా పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
* ట్రాఫిక్ నియంత్రణ – పార్కింగ్ ఏర్పాట్లు
గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు పార్కింగ్ సమస్యలు లేకుండా మెరుగైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
జాతరకు వచ్చే ప్రతి భక్తుడు సులభంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు
పూజారులు, యువత, మేడారం ప్రజలు, పోలీసులు — అందరూ ఒక కుటుంబంలా కలిసి పనిచేసి, ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఒక కుటుంబం లా పని చేసి మహా జాతరను విజయవంతం చేయాలనీ ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సమ్మక్క–సారలమ్మ పూజారులు, గోవిందరాజు, పగిడిద్ద రాజు పూజారులు ములుగు డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, అభ్యుదయ యూత్ యువత కన్నెపల్లి యువత తదితరులు పాల్గొన్నారు.
