* చకచకా రికార్డుల స్వాధీనం
* ఇకపై అధికారికంగా మహ మహానగరం
* ఉత్తర్వులు జారీ అయిన కొన్నిచోట్ల ఇప్పటికే మారిన బోర్డులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
మహా నగర శివారు పరిధిలోని 20 మునిసిపాలిటీలను, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీఓ 264 జారీ అయిన వెంటనే చకచకా మార్పులు మొదలైపోయాయి. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు విలీన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మునిసిపల్ పాలనకు సంబంధించిన రకరకాల రికార్డులను అక్కడి కమిషనర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చెక్ బుక్కులతో పాటు మినిట్స్ బుక్కులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇబ్బందులు తలెత్తకుండా..
పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారిక ఉత్తర్వుల్లోనే సర్కారు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఆయా మునిసిపాల్టీలు, కార్పొరేషన్లను తాత్కాలికంగా సర్కిళ్లుగా పరిగణిస్తున్నారు. పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా అక్కడి కమిషనర్లు ఇక నుంచి డిప్యూటి మునిసిపల్ కమిషనర్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు, ఆరు జోన్లు ఉన్నాయి. 27 విలీన మునిసిపాల్టీలతో కలిపి సర్కిళ్ల సంఖ్య 57కు పెరగనుంది. ప్రస్తుతానికి కొత్తగా జోన్లు ఏర్పాటు చేయకుండా ఇప్పటికే ఉన్న బల్దియా జోన్ల పరిధిలోకి ఆయా మునిసిపాల్టీల(సర్కిళ్లు)ను తీసుకువచ్చారు.
వెనువెంటనే..
ఉత్తర్వులు జారీ అయిన వెంటనే రాత్రికి రాత్రే సంబంధిత అధికారులు ఆయా కార్యాలయాలకు చేరుకున్నారు. సర్కిల్ 2 కమిషనర్ ఘట్కేసర్కు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సర్కిల్ 14 కమిషనర్ బోడుప్పల్‌కు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సర్కిల్ 16కమిషనర్ పీర్జాదిగూడకు వెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం రాత్రి వేళ కార్యాలయానికి వచ్చారు. డిప్యూటీ కమిషనర్ గంగాధర్ కార్యాలయంలో ఎకౌంటు బుక్స్, మీనట్ బుక్స్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన గాజులరామారం డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి మెరిట్ బుక్స్, రికార్డులు, ఎకౌంట్స్‌కు సంబంధించిన రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. కొంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ నరసింహ ఎకౌంటు బుక్స్ మెరిట్ బుక్స్, ఇతర రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. కొన్నిచోట్ల జీహెచ్ఎంసీ అంటూ బోర్డులను కూడా మార్చేశారు. ఈరోజు కూడా మిగతా కార్యాలయాలకు జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లనున్నారు.
…………………………………………
