* వాటర్ బిల్, పెండింగ్ చలాన్ల పేరుతో ఏపీకే లింకులు
* మొబైల్ హ్యాక్ చేసి డబ్బు కాజేస్తున్న వైనం
* ఒకే రోజులో 4 కేసులు.. రూ.8.24 లక్షలు స్వాహా
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
లాటరీ, ఆఫర్, డిస్కౌంట్ అంటూ ఏపీకే లింక్‌లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కరెంట్ బిల్లు పెండింగ్, వాటర్ బిల్లు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరుతో వల వేస్తున్నారు. వడ్డీలు తగ్గిస్తాం.. బకాయిలు మాఫీ చేస్తాం.. కొత్త కనెక్షన్లు ఇస్తాం.. అంటూ ఏపీకే లింకులు పంపుతున్నారు. నిజమే అనుకుని వాటిని క్లిక్‌చేసి వివరాలు నింపిన వెంటనే.. ఆయా ఫోన్లను తమ అధీనంలోకి తీసుకుని సొమ్ములు కాజేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒకే రోజులో.. ఒకే తరహాలో నలుగురి నుంచి రూ.8.24 లక్షలు దోచేశారు.
ఏపీకే లింకులు పంపి..
హైదరాబాద్ పటేల్‌నగర్‌కు చెందిన వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి ఐడీఎఫ్సీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుతామని హామీ ఇచ్చారు. ఏపీకే లింక్‌లో వివరాలు పంపమని సూచించగా అదే విధంగా చేశాడు. అతడి ఫోన్లో బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన సైబర్ నేరగాళ్లు ఓటీపీలు తమ ఫోన్‌కు వచ్చేలా మార్చుకొని అతడి ఖాతా నుంచి రూ2.95 లక్షలు కాజేశారు. యాకుత్‌పురాకు చెందిన వ్యక్తి (48)కి ఆర్టీఓ పెండింగ్ చలాన్ల పేరుతో లింకు పంపారు. దాన్ని క్లిక్ చేసిన బాధితుడి ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.2.26 లక్షలు కాజేశారు. షక్కర్‌గంజ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి (58)ని ఫోన్లో సంప్రదించిన ఓ వ్యక్తి ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై విధించిన చార్జీలు తీసివేస్తామని తెలిపారు. దీంతో వారు పంపిన ఏపీకే లింక్‌ను తెరిచి వివరాలు నమోదు చేశాడు. వెంటనే మొబైల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.1.72 లక్షలు వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.
శుభలేఖలు, శుభాకాంక్షల పేరుతో కూడా..
చివరికి పెళ్లి శుభలేఖలు, శుభాకాంక్షలు అంటూ ఏపీకే లింకులు పంపుతున్నారు. పెళ్లి ఎవరిది, శుభాకాంక్షలు ఎవరు పంపారు అన్న ఉత్సుకతతో ఆ లింక్‌లు తెరిచిన వారు బాధితులుగా మారుతున్నారు. ఏపీకే లింక్‌లు తెరిస్తే చాలు.. మొబైల్‌ను హ్యాక్ చేసి, వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారంతో బ్యాంకులో ఉన్న డబ్బు కాజేయడంతోపాటు బ్యాంకు ఖాతాలో డబ్బు లేకుంటే ఈ వివరాలతో రుణాలు తీసుకోవడంతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటున్నారు. చివరకు పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బు సైతం కాజేస్తున్నారు.
ఫోన్లో సమాచారం తెలుసుకుని..
కవాడిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి (48)కి పెండింగ్ ఆర్టీఏ చలాన్ల పేరుతో ఏపీకే లింక్ వచ్చింది. వివరాలు తెలుసుకునేందుకు సదరు వ్యక్తి ఏపీకే లింకు తెరిచాడు. అతడి మొబైల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి వ్యక్తిగత వివరాలు సేకరించి ఆగస్టు 30వ తేదీన రూ.51,226 లోన్ ద్వారా, పీఎఫ్ ఖాతా నుంచి రూ.50 వేలు మొత్తం రూ.1.01 లక్షలు కాజేశారు. బాధితులు ఏపీకే లింక్‌లు తెరవడం వల్ల అందులో ఉన్న మాల్ వేర్ సాయంతో ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఫోన్లో ఉన్న సమాచారం, ఆధార్, పాన్, బ్యాంకు సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ సమాచారం సాయంతో సైబర్ నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఏపీకే లింక్‌లు తెరవవద్దని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నారు.
……………………………………………….
