* మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, జాతర అభివృద్ధి పనులను, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. శనివారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, ప్రధాన ద్వారానికి సంబంధించిన భారీ రాతి స్తంభాలను వాటి నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని, అవసరం అయితే అదనపు సిబ్బందిని, యంత్రాలను ఉపయోగించి పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. జాతర సమయంలో కోట్లాది మంది భక్తులు వనదేవతల ను దర్శించుకోవడం కోసం వస్తూ ఉంటారని, దర్శనానికి పంపే సమయం లో క్యూలైన్స్ అతి ముఖ్యమని, క్యూ లైన్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.
జాతర సమీపిస్తున్న నేపథ్యంలో రహదారుల నిర్మాణం పనులలో వేగం పెంచాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన గడువులోపు అన్ని పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి, పి ఆర్ ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………….
