* స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్ రావు
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో మొదటి విడత తాడ్వాయి, ఏటూరు నాగారం మండలాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులుఅన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని అస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్ రావు సూచించారు. తొలి విడతగా ఎస్.ఎస్. తాడ్వాయి, ఏటూరు నాగారం మండలాలలో ఈ నెల 11న ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో, ఆయా మండలకు కేటాయించిన ఆర్.ఓ.లు, ఏ ఆర్ ఓలు, పి.ఓ. లకు ఎస్.ఎస్. తాడ్వాయి, ఏటూరు నాగారం మండల కేంద్రాల్లో వేరు వేరుగా శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమయ పాలనను పకాగా పాటిస్తూ, అప్రమత్తతో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల పై ప్రత్యేక జాగ్రత్తతో వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల ఆర్.ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బంది అందరికీ నియమ, నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అప్పుడే ఎక్కడ కూడా తప్పిదాలకు తావు లేకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయగల్గుతారని అన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా తగినంత కోరం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకొని సదుపాయాలను పరిశీలించుకోవాలని, ఓటింగ్ కంపార్ట్ మెంట్, సిటింగ్ ఏర్పాట్లు తదితర వాటిని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. శిక్షణా తరగతులలో సూచించిన అంశాలను ఆకళింపు చేసుకుని, విధిగా పాటించాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా, అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు “నోటా” సింబల్ ను కూడా తప్పనిసరిగా సరిచూసుకోవాలని అన్నారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఎం పి డి ఓ లు, ఎంపి ఓ లు, ఆర్.ఓ.లు, ఏ ఆర్ ఓలు, పి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.

………………………………
