* కావాల్సిందల్లా తప్పులు లేకుండా రాయడం
* ప్రింట్ మీడియాను సోషల్ మీడియా పరిగెట్టిస్తున్న కాలం
* వేగానికి, వాస్తవికతకు మధ్య పోటీ
* చెత్త వార్తలకు అడ్డుకట్ట వేయాలి
* డిజిటల్ యుగంలో మార్పులను అందిపుచ్చుకోవాలి
* సీనియర్ జర్నలిస్ట్ ఆర్. ఉమా మహేశ్వర్ రావు
* జర్నలిజం ఇన్ ద డిజిటల్ ఏజ్ పై సెమినార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏఐకి మించిన సాంకేతిక వ్యవస్థ వచ్చినా, తెలుగు జర్నలిజానికి ఢోకా లేదని, అయితే తప్పులు లేకుండా రాయడం నేర్చుకోవాలని సీనియర్ జర్నలిస్టు ఆర్. ఉమా మహేశ్వరరావు జర్నలిజం విద్యార్థులకు సూచించారు. డిజిటల్ యుగంలో మార్పులను తప్పనిసరిగా అందిపుచ్చుకోవాలని వెల్లడించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్-జర్నలిజం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం సెమినార్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన అతిథిగా విచ్చేశారు. జర్నలిజం ఇన్ ద డిజిటల్ ఏజ్ అంశంపై ప్రసంగించారు. జర్నలిజంలో వచ్చిన మార్పులను చక్కగా వివరించారు. ప్రింట్ మీడియాలో వచ్చిన వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేసుకునే కాలం పోయి, ప్రింట్ మీడియాను సోషల్ మీడియా పరిగెట్టించేలా కాలం మారిందన్నారు. అయితే తెలుగు జర్నలిస్టులకు ఏఐ కాదు కదా, ఏదీ సరిసమానం కాదన్నారు.
పోస్టుకార్డు వార్తల నుంచి వాట్సప్ వార్తల వరకు..
కాలానుగుణంగా జర్నలిజంలో చోటుచేసుకున్న మార్పుల్లో తన అనుభవాలనే పాఠాలుగా ఉమా మహేశ్వరరావు విద్యార్థులకు చక్కగా వివరించారు. జర్నలిస్టుల్లో సీనియర్, జూనియర్ ఉండరని, అందరూ నిత్య విద్యార్థులే అన్నారు. నిరంతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సర్టిఫికెట్ల కన్నా జర్నలిస్టులకు స్కిల్స్ ముఖ్యమన్నారు. 1940ల నాటి కాలంలో వార్తలను పోస్టుకార్డుల ద్వారా పంపేవారమని, అవి నాలుగైదు రోజుల తర్వాత గత వారం జరిగిన.. అంటూ ప్రచురితమయ్యేవని, నేటి స్పీడు యుగంలో గత అనే దానికి స్థానం లేదని తెలిపారు. పేపర్ కార్యాలయాలు అంటే పెద్ద కర్మాగారాలుగా ఉండేవని వివరించారు. పోస్టు కార్డు తర్వాత బేరిన్ కార్డు (టెలిగ్రామ్), ఆ తర్వాత టెలీ ప్రింటర్ వచ్చాయని, ఆ రోజుల్లో ఇది జర్నలిజంలో విప్లవాత్మక మార్పు అని తెలిపారు. టెలిప్రింటర్ తర్వాత పేజర్, పేజర్ మెసేజ్, సెల్ ఫోన్.. ఇంటర్నెట్ ఇలా.. మార్పులు వచ్చి వార్తల కంపోజింగ్ ను , ప్రచురించడాన్ని సులభతరం చేస్తూ వచ్చాయన్నారు. ఆర్టీసీ బస్సులు, ఫ్యాక్స్ ద్వారా కూడా వార్తలు పంపేవారమన్నారు. ఇప్పుడు వాట్సప్ లలోనే వార్తలు రాస్తున్నారని, పంపుతున్నారని తెలిపారు. రాసే అలవాటు ఇప్పుడు తప్పిందన్నారు. అయితే కాలానుగుణంగా సాంకేతిక మార్పుల వల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు.
నాడు నలుగురు.. నేడు సబ్ ఎడిటరే..
అక్షరాల పేర్పు నుంచి.. డీటీపీ విధానం వరకు కాలానుగుణంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని ఉమా మహేశ్వరరావు వివరించారు. 1995ల నాటి ముందు వరకు కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్, ప్రూఫ్ రీడర్స్, పేజ్ మేకింగ్ ఇలా రకరకాల విభాగాలు ఉండేవని, నాడు పేజి పెట్టడం నరకం అని 3 గంటల పాటు నిలబడి ఉండాల్సి వచ్చేదని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన మార్పుల్లో అన్ని పనులూ ఒక్కరే చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఆక్రమంలో స్కిల్ ఉన్నవారే జర్నలిజంలో ఉండగలిగారని తెలిపారు. కంపోజింగ్ సెక్షన్, ప్రూఫ్ రీడింగ్, పేజీ మేకింగ్ విభాగాలను తీసేసి, అన్ని పనులూ సబ్ ఎడిటరే నేర్చుకుని చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
ప్రింట్ మీడియా – సోషల్ మీడియా
1999- 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ అభివృద్ధి చెందాక డిజిటల్ విప్లవం మొదలైందన్నారు. పని విధానం కాస్త సులువైందన్నారు. అయితే పాతరోజుల్లో జర్నలిస్టు రాసిందే, పంపిందే వార్త అని, సోషల్మీడియా యుగంలో వార్తల ప్రవాహం పెరిగిందన్నారు. చెత్త వార్తల ప్రవాహం కూడా పెరిగిందన్నారు. ప్రింట్ మీడియాను సైతం సోషల్ మీడియా పరిగెట్టిస్తోందని, అయితే ప్రింట్ మీడియాకే విశ్వసనీయత ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాకు గేట్ కీపింగ్ లేదని, ప్రింట్ మీడియాలో విభిన్న క్రమాల్లో వార్తలను, వాస్తవాలను పరిశీలించి ప్రచురిస్తారని వెల్లడించారు. అయితే ప్రింట్ మీడియాలో కమ్యూనికేషన్ ఒకవైపే ఉంటుందని, సోషల్ మీడియాలో రెండు వైపులా ఉంటుందని తెలిపారు. అదే క్రమంలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండడం ప్రమాదకరమన్నారు. డిజిటల్ మీడియాలో వేగంగా ప్రజలకు చేరువైనా వాటిలో వాస్తవికతను కచ్చితంగా నమ్మలేమన్నారు. డిజిటల్ జర్నలిజం, మొబైల్ జర్నలిజం, సోషల్ మీడియా జర్నలిజం, ఏఐ జర్నలిజం ఇలా ఎన్ని వచ్చినా.. తెలుగు జర్నలిస్టును ఏమీ చేయలేవన్నారు. జర్నలిజం రంగంలో తెలుగు జర్నలిస్టుకు ఢోకా లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ ప్రొ. పద్మప్రియ, జర్నలిజం అధ్యాపకులు షమీర్, హసీనా, గోపాల్, ఎంసీజే జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసిన అధ్యాపకులు షమీర్కు డీన్ పద్మప్రియ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్ ఆర్. ఉమా మహేశ్వరరావును డీన్ పద్మప్రియ సత్కరించారు. జర్నలిజం విద్యార్థులు కూడా ఆయనతో పాటు తమ గురువులను కూడా సత్కరించారు.
…………………………………………………………..
