– గుడులు, బడులు, రోడ్లు, దవాఖానాలు తెచ్చింది కేసీఆర్
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని తాను గతంలో చెప్పిన విధంగా 1000 కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం కమలాపూర్ మండలంలో బత్తివానిపల్లి , లక్ష్మీపూర్, కన్నూరు, మర్రిపల్లి, వంగపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డ్ మెంబర్లకు మద్దతుగా కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పై విమర్శలు గుప్పించారు. కేంద్రం నుండి గ్రామాలకు డబ్బులు వస్తున్నాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటల చెప్తున్నాడని, రాష్ట్రం నుండి కేంద్రానికి వెళ్తున్న పన్నులు ఎంత, అందులో కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నది ఎంత స్పష్టంగా చెప్పాలని అన్నారు. హుజురాబాద్ లో గుడులు, బడులు, రోడ్లు, దవాఖానాలు తెచ్చింది కేసీఆర్ మాత్రమే అని, కేసీఆర్ హయాంలో చేయించిన పనులన్నీ తానే చేశానని ఈటల రాజేందర్ చెప్పుకుంటున్నాడని, నాటి ఉపఎన్నికల్లో కన్నీరు కార్చి, తన సహానుభూతి డైలాగులతో జనాన్ని మభ్యపెట్టింది, ఆ సంస్కృతిని మొదలుపెట్టింది ఈటలేనని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలకు మోసపోయారని, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, తులం బంగారం, రైతు పరిస్థితిపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన, జైల్లో వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్,వార్డ్ మెంబర్లను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

………………………………………..
