* అతిపెద్ద ఈవెంట్ ప్రారంభం
* భారీ ఏర్పాట్లు చేసిన సర్కారు
* దేశ విదేశాల ప్రముఖుల రాక
* ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
రాష్ట్రం ఆర్థికంగా సరికొత్తగా ఉద్భవించాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్-2047 పేరుతో కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన అతిపెద్ద సదస్సు గ్లోబల్ సమ్మిట్. రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు 20 రోజులుగా 25 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది చెమటోడ్చుతున్నారు. సమ్మిట్‌ను సక్సెస్ చేసేందుకు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ శ్రమించారు. అన్ని రాష్ట్రాలూ తిరిగి ప్రముఖులందరినీ ఆహ్వానించారు. దీంతో గ్లోబల్ సమ్మిట్‌కు నేడు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు విచేశారు. 2వేల మంది ప్రముఖులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
డ్రోన్లతో రిహార్సల్స్
గ్లోబల్ సమ్మిట్‌తో హైదరాబాద్ మహానగరానికి కొత్త కళ సంతరించుకుంది. ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎండీ శశాంక నేతృత్వంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాయంత్రం సుమారు 31 డ్రోన్లతో పోలీసు అధికారులు సమ్మిట్ ప్రాంగణంలో రిహార్సల్ చేశారు. దీంతో పాటు కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం ఆదివారం సాయంత్రం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులోకి పాసుల లేని వారిని అనుమతులు ఉండవని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
మూడంచెల భద్రత
సమ్మిట్ జరిగే మీర్కాన్‌పేట, బేగరకంచె గ్రామాలలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఇబ్రహీప్నటం ఏసీపీ రాజు తెలిపారు. సోమవారం, మంగళవారం రోజుల్లో కందుకూరు మండల కేంద్రం నుంచి మీర్కాన్‌పేట మీదుగా యాచారం వెళ్లే ప్రయాణికులను దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ రోడ్డుపై నుంచి కాకుండా హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి రాచులూరు గేటు నుంచి రాచులూరు, గుమ్మడవెళ్లి గ్రామం మీదుగా ఆకులమైలారం, మీర్కాన్‌పేట గ్రామానికి వెళ్లాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పాటు తమ పోలీసులకు సహకరించాలని వారు కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతులకు హెచ్ఎండీ తరహాలో ఏర్పాటు చేసిన వెంచర్‌ను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.
44 దేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు
ఈ సదస్సుకు ఆరు ఖండాలు, 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణలో నెలకొల్పేలా విజన్- 2047 సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను కళ్లకు కట్టినట్టుగా వివరించేందుకు సభా ప్రాంగణంలో భారీ స్థాయిలో ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేసింది. దేశ, విదేశాల నుంచి 1,500 మంది వరకు పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు, మరో 1,500 మంది అతిథులు ఈ సమ్మిట్‌లో పాల్గొనున్నారు. వీరికి అవసరమైన అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టారు. అతిథుల కోసం ప్రత్యేకంగా భోజనశాలలను ఏర్పాటు చేశారు.
…………………………………………..
