ఆకేరు న్యూస్, ములుగు: గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుండి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కాలంలో బయట నుండి వచ్చిన వ్యక్తులు సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో ఉండకూడదని తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో ప్రజలు గుంపులుగా చేరరాదని స్పష్టం చేశారు. పోలింగ్‌కు ముందు మరియు పోలింగ్ సమయంలో యంత్రాంగం పటిష్ఠ పర్యవేక్షణ చేపట్టాలని, ఎలాంటి ఎన్నికల ఉల్లంఘనలు జరుగకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని, ఏదేని ఉల్లంఘన జరిగినట్లు గమనిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల నోడల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని ఆయన స్పష్టంచేశారు.
…………………………………………..
