* బంగారంలో పెట్టుబడుల పేరుతో మోసం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆకట్టుకునే మెస్సేజ్‌లతో పరిచయం చేసుకుంది. ఆ తర్వాత తీయగా మాటలు కలిపింది. పెట్టుబడుల గురించి వివరించింది. బంగారం కంపెనీలో పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. కొంచెం మొత్తంలో మొదలుపెట్టి రూ. 24.44 లక్షల వరకు తీసుకెళ్లి మోసం చేసింది. సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తికి ఓ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తన పేరు శరణ్యగా పరిచయం చేసుకున్న మహిళ.. బాధితునితో పరిచయం పెంచుకుంది. కొద్దిరోజుల్లోనే మంచి స్నేహితురాలిగా మారింది. అనంతరం తన పథకం ప్రారంభించింది. తన వద్ద మంచి గోల్డ్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ ఉందని, అందులో పెట్టుబడులు పెడితే.. అనతి కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. అందుకోసం ‘కేడీఈ వన్ గోల్డ్’ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత అందులో పూర్తి వివరాలు నమోదు చేసి యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఇచ్చింది. ప్రారంభంలో కొద్దిమొత్తంలో పెట్టుబడి పెట్టిన బాధితునికి 70 శాతం లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించి ఆశపెట్టారు. దాంతో ఇదేదో మంచి ఇన్వెస్టిమెంట్ ప్లాన్‌గా ఉందని భావించిన బాధితుడు.. ఆ మహిళ చెప్పిన విధంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. అందుకు లాభంతో కలిపి రూ. 39 లక్షలు వచ్చినట్లు చూపించారు. అయితే వాటిని విత్‌డ్రా చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించగా విత్‌డ్రా ఆప్షన్ క్లోజ్ చేశారు. ఇదేంటని బాధితుడు ప్రశ్నిస్తే.. టాక్స్, కన్వర్షన్ చార్జెస్ అంటూ రూ. లక్షల్లో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతో ఇదేదో మోసంలా ఉందని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
……………………………………….
