* రెండు రోజులపాటు చర్చావేదికలు
* దేశ, విదేశాలకు పరిచయమైన తెలంగాణ నేల
* భారత్ ఫ్యూచర్ సిటీ రైజింగ్ కానుందా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్‌లో అక్షరాలా 5 లక్షలా 75 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కలు వినేందుకు భారీగానే ఉన్నాయి. చెప్పుకునేందుకూ గొప్పగా కనిపిస్తున్నాయి. ఏడాదిలో ఎన్ని కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు అమల్లోకి వస్తాయనే దానిని బట్టే తెలంగాణ రైజింగ్ కానుందా లేదా అనేది తేలనుంది. రెండు రోజులపాటు అట్టహాసంగా సాగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ దృష్టిని రాష్ట్రం ఆకర్షించింది అనడంలో సందేహం లేదు. అయితే.. ఆయా ఒప్పందాలపై నిరంతరం దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా ఆయా కంపెనీలు తెలంగాణలోకి అడుగుపెట్టి కార్యచరణ మొదలుపెట్టడంపైనే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది.
తెలంగాణ నేలపై..
ఈ గ్లోబల్ సమ్మిట్‌తో దేశ, విదేశాలకు తెలంగాణ నేల పరిచయమైంది అనడంలో సందేహం లేదు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, విద్యారంగాలకు చెందిన వారు, విదేశీ రాయబారులు, ఆయా దేశాలకు చెందిన నిష్ణాతులు ఈ సమావేశాల్లో పాల్గొనడం గర్వకారణం. రెండు రోజుల పాటు హంగులు, ఆర్భాటాలతో కొనసాగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మంగళవారం సాయంత్రం జరిగిన డ్రోన్ షోతో విజయవంతంగా ముగిసింది.
6 ఖండాలు.. 44 దేశాలు..
రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 6 ఖండాలు, 44 దేశాలతో పాటు మన దేశంలోని పలు రాష్ర్టాలకు చెందిన దాదాపుగా 2 వేల మందికిపైగా అతిథులు హాజరయ్యారు. చివరి రోజు బాలీవుడ్, టాలీవుడ్ నటులు సైతం సమ్మిట్ వేదికపై సందడి చేశారు. ఈ సదస్సులో మంగళవారం ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీపై డాక్యుమెంటరీని ఆవిష్కరించింది. పెట్టుబడులు సైతం వెల్లువలా వస్తుండటం గమనార్హం. పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా భారత్ ఫ్యూచర్‌సిటీని అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రారంభించే సమయం పట్టి ఫలితం
గ్లోబల్ సమ్మిట్‌లో ఎఫ్‌సీడీఏ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి ప్రణాళిలను ప్రభుత్వం ప్రపంచం ముందు ఉంచింది. రానున్న రోజుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ రెండు ప్రధాన రహదారులు, రాజధానికి అనుసంఽధానంగా 30వేల ఎకరాల్లో అత్యాధునిక నగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కందుకూరు, మహేశ్వరం, యాచారం, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు మండలాల్లోని 56 గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. కొత్త నగర నిర్మాణం పూర్యయ్యేందుకు పట్టే కాలంపైనే తెలంగాణ రైజింగ్ ఆధారపడి ఉంది. సమ్మిట్ లక్ష్యం ముడిపడి ఉంది.
………………………………………………………………………..
