* తెలంగాణ చోర్ రేవంత్ రెడ్డి
* మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు జరిగాయని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యూర్, క్యూర్, రేర్ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను కొల్లగొడుతున్నారని అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదని.. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయ్యిందంటూ కామెంట్స్ చేశారు. పెట్టుబడుల కట్టు కథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్‌ను అట్టర్ ఫ్లాప్ చేశారంటూ ఫైర్ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారంటూ మాజీ మంత్రి సంచలన ట్వీట్ చేశారు. ‘విజన్ డాక్యుమెంట్లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు, విజన్ డాక్యుమెంట్ కాదు.. ‘విజన్ లెస్’ డాక్యుమెంట్. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్. గ్లోబల్ సమ్మిట్‌లో ఎంవోయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
……………………………………………………….
