-ఉదయం 9 వరకు 15.9 శాతం గా ఓటింగ్ నమోదు
– ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 పోలింగ్
– మధ్యాహ్నం రెండు గంటలకి లెక్కింపు
– ఉత్సాహంగా యువ ఓటర్లు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : నేడు కమలాపూర్ మండల వ్యాప్తంగా పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రశాంతంగా ప్రారంభమైంది.పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు. మండలంలో కొత్తపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవం కాగా మిగిలిన 23 గ్రామాలలో పోలింగ్ ప్రారంభమైంది. మొదటి విడత స్థానిక ఎన్నికల్లో మొత్తం 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కమలాపూర్ కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్
ఓటర్లు భయం, బెదిరింపు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచేలా మండల కేంద్రంలో నిన్న బుధవారం సాయంత్రం పోలీసు బలగాలతో కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో అడ్మిన్ అడిషనల్ డీసీపీ రవి , ఏసీపి సిసిఎస్ సదయ్య , కాజిపేట్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి , సీఐ హరికృష్ణ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాగా ఎప్పటిలానే ఈసారి కూడా మండలంలో ఓటర్లకు చీరలు, నగదు, మద్యం సరఫరా అయ్యాయి.
ఉత్సాహంగా యువ ఓటర్లు
స్థానిక ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన యువ ఓటర్లు మాట్లాడుతూ…. నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధి చేసే, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి , ఊరి బాగు కోసం పనిచేసే వ్యక్తికే సర్పంచ్ గా, వార్డ్ మెంబర్ గా తమ ఓటు అని అంటున్నారు.

…………………………………………
