* ఆర్టీఐ సమాచార జాప్యంపై సీరియస్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న ఐఏఎస్లు ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్పై ఇద్దరు ఐఏఎస్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ చట్టం కింద సమాచారం అందజేయలేదని మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్టీఐలో సదరు వ్యక్తి అడిగిన సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించింది. ఆర్టీఐ చట్టం ప్రకారం పిటిషనర్ అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో సికింద్రాబాద్లోని రాంగోపాల్పేటకు చెందిన వడ్డం శ్యామ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అడిగిన సమాచారం ఇవ్వాలని హై కోర్టు ఆదేశించినా.. అధికారులు ఇవ్వడం లేదని శ్యామ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని ఐఏఎస్ అధికారులపై మండిపడింది. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26న కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా.. నిర్లక్ష్యం వహిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
……………………………………………..
