* కస్టోడియల్ దర్యాప్తునకు సిట్‌కు అనుమతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సిట్ దర్యాప్తు అధికారి ఎదుట రేపు ఉదయం 11 గంటలు లోగా లొంగిపోవాలని పేర్కొంది. జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం కస్టోడియల్ దర్యాప్తు నిమిత్తం సిట్ కు అనుమతి ఇచ్చింది. అయితే భౌతికంగా ఎలాంటి హానీ జరగకూడదని ఆదేశించింది.
సంచలన కేసు..
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వదేశానికి తిరిగి వస్తున్నారు. జూన్ 5వ తేదీన ఈ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌కు విచ్చేసిన ఆయన పలుమార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, స్వపక్షంలోని అసంతృప్తి నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు గుర్తించింది. ఇక ఈ కేసుతో ప్రమేయమున్న వారిందరిని ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేపట్టారు. ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు తీసుకునే క్రమంలో కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
…………………………………………………….
