ఆకేరు న్యూస్, కమలాపూర్ : భారత్‌లోనే మొదటిసారిగా మధ్యప్రదేశ్ లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారిపై టేబుల్‌టాప్ ఎరుపు మార్కింగ్ ప్రవేశపెట్టింది. సుస్థిర అభివృద్ధి లో భాగంగా అభివృద్ధితో పాటు వన్యప్రాణి సంరక్షణ సాధ్యమయ్యేలా NHAI చేపట్టిన చర్యలో భాగంగా భోపాల్-జబల్పూర్ వద్ద NH-45 రహదారి వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యం గుండా వెళుతుంది. 11.9 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టులో, 2 కిలోమీటర్ల మేర ప్రత్యేక ఎరుపు ఉపరితలాన్ని NHAI ఏర్పాటు చేసింది. ఈ 5 మిల్లీమీటర్ల మందం గల ఎరుపు పొర, డ్రైవర్లకు వన్యప్రాణి సున్నిత ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారని హెచ్చరిక చేస్తుంది. కాస్త ఎత్తైన టెక్స్చర్ కారణంగా వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. దీంతో వన్యప్రాణులు వాహనాలను ఢీకొనే ప్రమాదాలు తగ్గుతాయి. పులులు, జింకలు, చిరుతపులులు వంటి జంతువులు సురక్షితంగా అడవి గుండా పోయేందుకు ఇది సహాయపడుతుంది. రూ122 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 25 జంతు అండర్‌పాస్‌లు, చైన్-లింక్ ఫెన్సింగ్, స్పీడ్ డిటెక్షన్ పరికరాలు ఉన్నాయి. ఇటీవల గ్వాలియర్‌లో చిరుత పిల్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా అనేక అటవీ రహదారుల్లో ఇలాంటి రెడ్ జోన్లను అమలు చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ నూతన ఆవిష్కరణతో అభివృద్ధి-సంరక్షణ సాధ్యమని రుజువు కానుంది.
………………………………………..

