* తెలుగు రాష్ట్రాల్లో వృద్ధులు.. చిన్నారులు జాగ్రత్త
* పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
* అప్రమత్తం అంటున్న వైద్యులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. బావుల్లో నీళ్లు కూడా గడ్డ కట్టేలా వాతావరణం మారిపోయింది. ఇళ్లల్లో ఉన్నా ముక్కులు మూసుకుపోతున్నాయి. ఈక్రమంలో వృద్ధులు.. చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా న్యుమోనియా బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం అని, తప్పనిసరైతే చలి నుంచి తట్టుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరో రెండు రోజులు రాష్ట్రంలో మరింత చలిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో 6.2 డిగ్రీలు, మెదక్లో 7.2, హనుమకొండలో 8.6, నిజామాబాద్ 11.4, హైదరాబాద్లో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 32 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఏపీలోనూ చలి వణికిస్తోంది. పాడేరు, అరకులో 4 డిగ్రీల టెంపరేచర్ నమోదవ్వడంతో వాటర్ గడ్డకడుతోంది. వ్యవసాయ భూముల్లోని నీరు కూడా గడ్డ కట్టడంతో రైతులెవ్వరూ ఉదయాన్నే పొలాల వైపు వెళ్లట్లేదు. ఉదయం 9 గంటలు దాటినా చాలా ప్రాంతాల్లో పొగమంచు వీడడం లేదు.

