ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. డీ లిమిటేషన్ పై కొంత మంది కార్పొరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జీహెచ్ ఎంసీ విలీనంపై ప్రత్యేక సమావేశంలో చర్చించారు. అశాస్త్రీయంగా విభజన జరిగిందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీల విలీనంతో జీహెచ్ ఎంసీ పరిధి పెరిగింది. 150 నుంచి 300కు పెరిగిన డివిజన్లు. డివిజన్ల డీ లిమినేషన్ గందరగోళంగా ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొన్ని చోట్ల 50 వేల మందితో ఓటర్లు ఉంటే, కొన్నిచోట్ల 20 వేల ఓటర్లతోనే డివిజన్లు ఏర్పాటయ్యాయని విమర్శించారు. ఇంక అత్యవసరంగా, కమిషనర్లకు కూడా సమాచారం లేకుండా కలపాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన విభజన చేశారో స్పష్టత లేదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే డీ లిమిటేషన్ అని, అందరూ స్వాగతించాలని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. స్థానిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. జీహెచ్ ఎంసీ డీ లిమిటేషన్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. జనాభా, భౌగోళికం, ప్రజలు ఇందులో ఏదీ ప్రామాణికం లేదని విమర్శించారు. ఒక వార్డులో 25 వేల ఓటర్లు, మరో వార్డులో 60 వేల మందితో విభజన చేశారని అన్నారు. ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఏ కార్పొరేటర్‌ను, ఏ రాజకీయ నేతనూ సంప్రదించకుండా, ల్యాప్ టాప్ పెట్టుకుని గూగుల్ మ్యాప్ చూసేసి చేసిన అంశంగా విభజన తీరు ఉందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉన్నా లేదా అనేది పరిశీలించాలని అన్నారు. విభజన అనేది భవిష్యత్ తరాలకు చాలా అవసరమైన అంశం కాబట్టి, రెండు రోజులు సమయమనా క్షుణ్నంగా చర్చించాలని సూచించారు.
……………………………………

