*డివిజన్ల పునర్విభజనపై ఫిర్యాదుల వెల్లువ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహ మహానగరం విస్తరణ ప్రక్రియ ఏం బాగాలేదని, డివిజన్ల ప్రక్రియ సవ్యంగా లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను విభజించి 300 వార్డులుగా చేయాలని ప్రభుత్వం భావించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని పలు పార్టీలు, కాలనీ అసోసియేషన్, బస్తి సంక్షే మ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్మిక నగర్ డివిజన్ పేరును శివమ్మ పాపిరెడ్డి హిల్స్ (ఎస్పిఆర్ హిల్స్)గా నామకరణం చేయాలని అభ్యంతరం తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు. కార్మికనగర్లోని కొన్ని బస్తీలు రాజీవ్ నగర్ డివిజన్‌లోకి కలిపారు. అలా కాకుండా ఎస్పీఆర్ హిల్స్ బస్తీలన్నీ అందులోనే ఉంచాలని కోరుతున్నారు. పాత వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో మధురానగర్ డివిజన్ నూతనంగా ఏర్పడింది. అయితే పాత వెంగళరావు నగర్ డివిజన్ పేరు మార్చి కొత్తగా జవహర్ నగర్ డివిజన్‌గా పేరు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని బస్తీలు శాస్త్రీయ నగర్, హేమావతి నగర్లను కొత్తగా ఏర్పడిన రాజీవ్ నగర్లో కలిపారు ఈ రెండు బస్తీలను రాజీవ్ నగర్ నుండి తొలగించి పాత ఎర్రగడ్డ డివిజన్‌లోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
అశాస్త్రీయం
గోల్నాక డివిజన్ రెండుగా విభజించి గోల్నాక, తులసీరాంనగర్ రెండు డివిజన్లుగా విభజించిన శాస్త్రీయంగా జరగలేదని స్థానికులు, రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ విభజన శాస్తీయంగా జరగలేదని ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలతో పాటు పలువురు జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్ డీఎంసీకు వినతి పత్రాలు అందజేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న గోల్నాక డివిజన్ ఆలీకేఫ్ చౌరస్తా నుంచి చాదర్‌ఘాట్ ఎంసీహెచ్ క్వార్టర్స్ కామ్గార్నగర్ వరకు పరిధి విస్తరించి ఉంది. ప్రస్తుతం జరిగిన డివిజన్ల విభజనతో గోల్నాక డివిజన్‌ను గోల్నాక, తులసీరాంనగర్ డివిజన్లుగా విభజించారు. ఈ డివిజన్ల విభజన పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
………………………………………..
