* 150 డివిజన్ల జీహెచ్ఎంసీలో కింగ్ మేకర్
* 300 డివిజన్లలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్‌ను మార్చి తెలంగాణ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. కొద్ది రోజులుగా దాని చుట్టూనే చర్చలు, అభిప్రాయ సేకరణలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా జీహెచ్ఎంసీ పునర్విభజనపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. విభజన తీరును చాలా మంది కార్పొరేటర్లు విమర్శించారు. అశాస్త్రీయత లేదని, పార్టీల నేతలను, కార్పొరేటర్లను సంప్రదించకుండానే విభజించారని అన్నారు. ల్యాప్‌టాప్ పట్టుకుని గూగుల్ మ్యాప్‌ల ఆధారంటా వార్డుల విభజన జరిగిందని ఆరోపించారు. ప్రాంతం, ప్రజలు, ఓటర్లు.. ఇలా ఏ ప్రాతిపదికా లేకుండానే 150 వార్డులను 300 వార్డులుగా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం జరగనుంది?
విభజన ప్రక్రియపై విమర్శలు చేస్తూనే రాజకీయంగా లాభమెంత.. నష్టమెంత అని కూడా ఆయా పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. 150 వార్డులు గల పాత జీహెచ్ఎంసీలో కింగ్ మేకర్‌గా ఉన్న విస్తరిత మహ మహానగరంలో మజ్లిస్ ప్రాభవం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాతబస్తీలో ఎన్ని డివిజన్లు పెరిగాయి? ఎంఐఎం బలాబలాలు ఎలా మారబోతున్నాయి? మేయర్ పీఠం విషయంలో ఆ పార్టీ గతంలోలా కీలకం కానుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
డివిజన్లు పెరిగాయి కానీ..
హైదరాబాద్ మహానగరంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఏడు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా అసెంబ్లీల పరిధిలో పాత జీహెచ్ఎంసీలో 44 డివిజన్లు ఉన్నాయి. 40 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు 2020లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. నాలుగు చోట్ల కాషాయ పార్టీ బీజేపీ గెలిచింది. ఎంఐఎం ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ షేక్‌పేట, ఎర్రగడ్డ, ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్, గోషామహల్‌లోని దత్తాత్రేయనగర్ డివిజన్లలో ఆ పార్టీ కార్పొరేటర్లు విజయం సాధించారు. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం డివిజన్ల సంఖ్య 62కు పెరిగింది. గతంతో పోలిస్తే 18 డివిజన్లు అధికమయ్యాయి.
అప్పుడు షేర్ 29 నుంచి 32 శాతం
గతంలో 150 డివిజన్లలో ఆ పార్టీ 44 నుంచి 48 స్థానాల్లో విజయం సాధించేది. అప్పటి 150 డివిజన్లలో ఇది 29 నుంచి 32 శాతం. ఇతర పార్టీలు కూడా 10 స్థానాలు అటు, ఇటుగా అదే స్థాయిలో విజయం సాధించే వారు. దీంతో ఎంఐఎం మద్దతు కీలకంగా మారేది. ప్రస్తుతం 300 డివిజన్లలో ఎంఐఎం నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట 62 డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఆ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందన్నది కీలకం కానుంది. ఆ పార్టీ 60కిపైగా స్థానాలు గెలిచిన పక్షంలో.. మొత్తం డివిజన్లలో అది 20 శాతం మాత్రమే అవుతుంది. దీంతో గతంతో పోలిస్తే తమ ప్రాభవం తగ్గే అవకాశం ఉందని ఎంఐఎం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
……………………………………………..
