* పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
* ఉత్తర, మధ్య భారతదేశంలో దట్టమైన పొగమంచు
* రవాణ కర్యకలాపాలకు ఆటంకాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
పొగ మంచు దేశ వ్యాప్తంగా కమ్మేస్తోంది. ప్రధానంగా ఉత్తరాధిని వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వృద్ధులు, చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆగిపోతున్న విమానాలు
పొగమంచు రోడ్డు రవాణాకే కాదు.. ఆకాశయానానికి తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించక చాలా విమానాలను రద్దు చేయాల్సి వస్తోంది. నిన్న (శుక్రవారం) ఢిల్లీ విమానాశ్రయం నుంచి దాదాపు 152 విమానాలు రద్దయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఏమీ కనిపించని స్థితి ఏర్పడిందని, రద్దు చేసిన 152 విమాన సర్వీసులలో 79 నిష్క్రమణ, 13 ఆగమన విమానాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అంతేకాదు.. కాలుష్య తీవ్రత ఆధారంగా మూడు పరిస్థితులలో పనిచేస్తున్న ఢిల్లీ విమానాశ్రయంలో జాప్యాలు, అవాంతరాలు ఏర్పడుతున్నాయి. విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు ఎప్పటి కప్పుడు తమ విమానాల స్టేటస్ గురించి సంబంధిత ఎయిర్‌లైన్స్‌ని అడిగి తెలుసుకోవడం ఉత్తమమని ప్రయాణికులకు ఎక్స్ ద్వారా ఢిల్లీ ఎయిర్‌పోర్టు సూచించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ప్రతికూలతలు
పొగమంచు ప్రభావంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లపై ఎదుటి వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ రోడ్డుపై పొగమంచు కారణంగా ప్రమాదానికి గురై ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మంచుతో వాతావరణ కాలుష్యం పెరిగి శ్వాసకోశ సమస్యలు వస్తాయి, ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాల్లో ఇది తీవ్రంగా ఉంటోంది. చలి తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పొగమంచు, కాలుష్యం కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు.
తెలంగాణలో ఇలా..
తెలంగాణ వ్యాప్తంగా ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులతోపాటు పొగమంచు కమ్మేస్తోంది. చలి తీవ్రతకు దాదాపు 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో సగటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయని వెల్లడించింది. ఉత్తరభారతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరిగిందని పేర్కొన్నది. మరో రెండు, మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో శుక్రవారం అత్యంత కనిష్ఠంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6.4, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.5, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 7.7, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటలో 7.8, సిద్దిపేట జిల్లా రాయపోలులో 8.1, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జాగ్రత్తలు అవసరం..
రాత్రి 9 గంటల నుంచే పొగమంచు మొదలై కొన్ని ప్రాంతాల్లో ఉదయం 11 గంటల వరకు కూడా ఉంటోంది. మంచు కారణంగా రోడ్లపై వాహనాలు సరిగా కనిపించవు. అందువల్ల అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే తక్కువ వేగంతో, జాగ్రత్తగా వాహనాలను నడపాలి. ముఖ్యంగా పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మంచిది.
……………………………………………
