* తీర్మానించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం
* ప్రభుత్వంతో చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం రావాలి
* లేనిపక్షంలో పోరాట మార్గాన్ని అనుసరిస్తాం
* వెల్లడించిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ
ఆకేరున్యూస్, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252పై రాష్ట్రవ్యాప్తంగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు వినతిపత్రాలు ఇవ్వాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ వివరించారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం టియూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవో నంబర్ 252పై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపిన నేపధ్యంలో దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా కమిటి నిర్ణయిందన్నారు. ఇందులో భాగంగానే ప్రజా ప్రతినిధులకు మొదటగా వినతిపత్రాలు ఇచ్చి, అసెంబ్లీలో వారు చర్చించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. జీవో 252 కారణంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య కార్యాచరణ చేపట్టాలని నిర్ణయిస్తూ, ప్రభుత్వంతో చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం రావాలని, లేనిపక్షంలో పోరాట మార్గాన్ని అనుసరిస్తామన్నారు. జీవో 252 సవరించేవరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. డెస్క్ జర్నలిస్టులకు రెండు కార్డుల విధానాన్ని తెచ్చి తీరని అన్యాయం చేసిందని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. పెద్ద పేపర్లతో పాటు మధ్య చిన్న తరహా పత్రికలకు, శాటిలైట్ చానల్స్ కు పెద్ద సంఖ్యలో కార్డులు తగ్గించడం, కేబుల్ చానల్స్ కు రాష్ట్ర స్థాయిలో అసలు కార్డు లేచి లేకుండా చేయడం జీవో ఉద్దేశాన్ని అర్థం చేస్తుందని అన్నారు. జర్నలిస్టులకు అన్యాయం జరిగే ఇలాంటి జీవో సవరణ చేయడం గానీ, నూతన జీవో తీసుకురావడం గాని ఈ ప్రభుత్వం వెంటనే చేయాలని ఆయన కోరారు. వచ్చే ఏడాది మార్చి నెలలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ నిర్వహించి పూర్తి స్థాయి కమిటీ వేనునున్నట్లు ఆయన వివరించారు. ఆప్పటివరకు మిగిలిన కొన్ని జిల్లాలలో పూర్తిస్థాయి కమిటీ లు వేసుకోవాలని సూచించారు. ఇళ్ల స్థలాల సమస్యపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలని తీర్మానించారు.
చిన్న పత్రికల ఎంప్యానల్మెంట్ సమస్య పరిష్కారానికి సమాచార శాఖ భవన్ ముట్టడికి త్వరలో శ్రీకారం..
చిన్న పత్రికల ఎంప్యానల్మెంట్ సమస్య పరిష్కారం కోసం సమాచార శాఖ భవన్ ముట్టడి కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడతామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ ట్రస్ట్’ ప్రారంభించామని ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ మాట్లాడుతూ, జీవో 252ను స్పష్టత లేకుండా జర్నలిస్టు యూనియన్లతో సంప్రదింపులు జరపకుండా విడుదల చేశారని ఆరోపించారు. గతంలో జీవో 239 రూపకల్పన సమయంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాజా జీవో 252లో ఆ స్ఫూర్తి పూర్తిగా లోపించిందన్నారు. ప్రస్తుత నిబంధనల కారణంగా సుమారు 13 వేల అక్రిడేషన్ కార్డులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ఇది జర్నలిస్టుల వృత్తి భద్రత, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అక్రిడేషన్ కార్డుల దుర్వినియోగంపై కఠిన చర్యలు అవసరమేనని, అయితే అర్హులైన జర్నలిస్టులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని వారు స్పష్టం చేశారు. ప్రధాన జర్నలిస్టు యూనియన్ల అభిప్రాయాలను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీడియా అకాడమీ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హాజారీ, కోశాధికారి యోగానంద్, రాష్ట్ర టెంజు అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, కార్యదర్శి రమణ, ఐజేయూ జాతీయ నాయకులు భాస్కర్, తిరుపతి నాయక్, రాష్ట్ర నాయకులు గుండు ముత్తయ్యగౌడ్, సుధాకర్, లెనిన్, రాజ్ నారాయణ, రాంగోపాల్, సి హెచ్ .సుధాకర్, నవీన్ కుమార్ యారాతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జర్నలిస్టులు హాజరయ్యారు.

…………………………………………………………..

