* హైదరాబాద్ చేరుకున్న గులాబీ బాస్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. గతానికంటే భిన్నంగా ఈ సమావేశాలపై ఉత్కంఠ ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ ఎస్ మధ్య మాటల వాడివేడి పెరిగింది. అప్పటి వరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్ రావుతో పాటు మరికొందరు మాత్రమే కాంగ్రెస్ ను ఢీకొడుతూ వస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంతర్గత సమావేశాలకు మాత్రమే పరిమితమవుతూ వచ్చారు. అయితే.. కొద్ది రోజుల క్రితం మీడియా ముందుకు ఆయన తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శల అస్త్రాలు సంధించారు. ఇక నుంచి తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తా అని హెచ్చరికలు జారీ చేశారు. ఈక్రమంలో నేడు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ ఏర్పడింది. సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా?.. లేదా?.. అనే ఉత్కంఠ రేపుతున్న తరుణంలో అవును.. వస్తారని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
నివాసానికి కేసీఆర్
ఎర్రగడ్డ ఫాం హౌస్ నుంచి బంజారాహిల్స్ లోని తన నివాసానికి కేసీఆర్ ఆదివారమే చేరుకున్నారు. దీంతో ఆయన తప్పక సమావేశాలకు హాజరవుతానే ప్రచారం జరుగుతోంది. తాను సమావేశాలకు వస్తున్నట్లు అంతకు ముందే కీలక నేతల భేటీలోనూ చెప్పినట్లు తెలిసింది. ఇటీవల బీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ఆ తర్వాత.. ప్రెస్మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్ట్‌ల విషయంలో రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరో అడుగు ముందుకేసి.. ఇక నుంచి లెక్క మరోలా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కాక పెరిగింది.
వేడెక్కనున్న రాజకీయం
ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతే సాగే తీరు ధూం.. ధాంగా ఉంటుందని బీఆర్ ఎస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సభ నిర్వహణపై అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం అత్యంత హుందాగా వ్యవహరిస్తుందని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెబుతామని, వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం వెనకాడబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
15 రోజులు నిర్వహించాల్సిందే..
ప్రతిపక్షం నుంచి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోలా స్పందించారు. ఎన్ని రోజులైనా సభను నడుపుతామని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ ప్రభుత్వం, తీరా సమయం వచ్చేసరికి కేవలం ఒక్క రోజుతోనే సమావేశాలను ముగించేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలు చర్చకు రాకుండా తప్పించుకోవడానికే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అనేక కీలక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి తరుణంలో నేటి నుంచి ప్రారంభం అయ్యే సమావేశాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి.
…………………………………………………..

