* హైదరాబాద్‌లో తరచూ ప్రమాదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంక్రాంతి వస్తోందంటే హైదరాబాద్‌లో నెల రోజుల ముందు నుంచే పతంగుల సందడి మొదలవుతోంది. పిల్లలు, పెద్దలు కూడా గాలి పటాలు ఎగురవేస్తూ సందడి చేస్తుంటారు. అయితే.. పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ మాంజా గొంతుకు తగులుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక వ్యక్తి చైనా మాంజా వల్ల గొంతు కోసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కీసీరకు చెందిన మరో యువకుడికి ఏకంగా 19 కుట్లు పడ్డాయి. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ నవాబ్ సాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు చార్మినార్ వైపు బైక్ వెళుతున్నాడు. శంషీర్ గంజ్ ప్రాంతంలో చైనా మాంజా అతడి గొంతుకు తగిలి కోసుకు పోయింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
నిషేధం ఉన్నా..
చైనా మాంజాలతో అపాయం ఉందన్న కారణాలతో దాని వాడకంపై తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో నిషేధం విధించింది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, నిఘా లేకపోవడం వల్ల దానిని అందరూ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. చాలా తక్కువ ధరకే దొరుకుతుండడంతో అందరూ పతంగులు ఎగరేయడానికి చైనా మాంజానే వినియోగిస్తున్నారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పతంగులకు, మాంజాల హోల్‌సేల్ షాప్‌లకు కేరాఫ్‌గా ఉన్న అఫ్జల్‌గంజ్, మంగళ్‌హాట్, ఓల్డ్‌సిటీలోని ఇతర ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు.
సమాచారం ఇస్తే రూ.5వేలు
చైనా మాంజాతో కలుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకుని వాటి అమ్మకాల నివారణకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు ఇస్తానని పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారులు లాభాపేక్షతో చైనా మాంజాను విక్రయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
……………………………………………………………….

