ఆకేరున్యూస్ డెస్క్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధినేత్రి బేగం ఖలీదా జియా (80) కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఖలీదా జియా గత కొన్నేళ్లుగా లివర్ సిర్రోసిస్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, డయాబెటిస్ వంటి తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారు. నవంబర్ 23 నుంచి ఆమె ఆస్పత్రిలో చేరి వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించి ఈ రోజు మరణించారు. బంగ్లాదేశ్ చరిత్రలో తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా 1991-1996, 2001-2006 కాలంలో రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ 1981లో హత్యకు గురైన తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. షేక్ హసీనాతో దశాబ్దాల పాటు తీవ్ర ప్రత్యర్థిత్వం కొనసాగించారు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఖలీదా జియా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. 2025 ప్రారంభంలో అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు నుంచి క్లీన్చిట్ పొందారు. ఫిబ్రవరి 2026 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలోనే మరణించారు. బీఎన్పీ అధికారికంగా ఖలీదా జియా మరణాన్ని ధృవీకరించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేయాలని కోరింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖలీదా జియా మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక యుగం ముగిసింది. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ పార్టీ నాయకత్వం చేపట్టనున్నారు.
………………………………….

