* మంత్రి పొంగులేటిని కలిసిన యూనియన్ నేతలు
* అక్రిడిటేషన్ల గడువు మరో 2నెలలు పొడిగింపు
ఆకేరున్యూస్, హైదరాబాద్: అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ జర్నలిస్టులు వారం రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ.. టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎప్టీ నేతలు మంగళవారం సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. డెస్క్ జర్నలిస్టులకు గతంలో లాగే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జీవో 252ని సవరించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. స్పోర్ట్స్, కల్చరల్, ఫీచర్ ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు సంఘాల వినతిపై మంత్రి పొంగులేటి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రిపోర్టర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహాలు పడొద్దని వివరించినట్లు సమాచారం. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అపోహాలను తొలగించే ప్రయత్నం చేస్తానని హామి ఇచ్చారు. జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా జీవో 252ను సవరిస్తామని మంత్రి చెప్పినట్లు సమాచారం. కాగా, నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న తరుణంలో ఆలస్యం కాకుండా ప్రస్తుతం ఉన్న అక్రిడేషన్ల గడువును మరో రెండు నెలలు పొడిగించారు. ఈ మేరకు సమాచారశాఖ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగిస్తూ సమాచారశాఖ కమిషనర్ ప్రియాంక ప్రకటన విడుదల చేశారు.

…………………………………..

