* భక్తి – ఆనందం – ఆహ్లాదం తో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు
* రాష్ట్రమంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా అడవి ప్రకృతి ప్రాంతం వన ప్రేమికులకు, పర్యాటకులకు భూతల స్వర్గధామంగా ఉందని, సహజ సిద్ధ ప్రకృతి అందాలు, భక్తి – ఆనందం – ఆహ్లాదం తో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు నెలవై ఉన్నాయని, ములుగు జిల్లా పర్యాటక అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్ , తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డి.ఎఫ్.ఓ. రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడ్వాయి హాట్స్ ఆవరణలో ఉన్నటువంటి వివిధ జాతులకు చెందిన వృక్షాల గూర్చి, అరుదైన జాతుల వృక్షాల గురించి వాటి ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను మంత్రి సీతక్క కు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. అనంతరం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పి సధీర్ రామ్ నాథ్ కేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్ సుమారు 7 కిలోమీటర్ల మేర పర్యటించారు.
అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఎకో టూరిజం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్ లోని తాడ్వాయి హాట్స్ ను ఆధునీకరణంగా సుందరీకరించి ప్రకృతి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్ పరిధిలోని తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారికి పక్కన 6 హాట్స్ ను, 18 కిలోమీటర్లు మేర సఫారీ చేయడానికి 2 సఫారీ వాహనాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ములుగు జిల్లా పేరు చెప్పగానే ఎంతోమంది పర్యాటకులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని భక్తితో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు గుర్తుకు వస్తాయని అన్నారు.
పర్యాటకులు భక్తులు ములుగు ప్రాంతానికి రావడంతోనే ఆది దేవత ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రపంచ పర్యాటకులను సైతం ఆకట్టుకుంటుందని, రామప్ప సరస్సు మధ్యగల ద్వీపకల్పం లో నూతనంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రకృతి సహజ సిద్ధంగా కొండల మధ్య కాకతీయులు నిర్మించిన లక్నవరం సరస్సు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, వచ్చే పర్యాటకులకు మరింత సౌకర్యాలు కల్పించే విధంగా సరస్సు మధ్యలో కాటేజీలను నిర్మించడం జరిగిందని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర , తెలంగాణ కుంభమేళాగా పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను కూడా ప్రజా ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతరకు భక్తులు విచ్చేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. పసర తాడ్వాయి జాతీయ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఇసుక తీన్నెలు కలిగిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను మరల పునః ప్రారంభించడం జరిగిందని ఇక్కడికి వచ్చే పర్యాటకులకు నైట్ క్యాంప్ విడదీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆయుర్వేద మూలికలు కలిగిన ప్రాంతంగా పేరు పొందిందని, తెలంగాణ నయాగరా బొగత వాటర్ ఫాల్స్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
ములుగు జిల్లా పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి వచ్చే పర్యాటకులకు భక్తులకు ప్రకృతి సహజసద్ధమైన పర్యాటక ప్రదేశాలు స్వచ్ఛమైన గాలి లభ్యం అవుతుందని, చాలామంది సెలవు దినాలలో సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను చూడటానికి వెళుతుంటారని హైదరాబాద్ కేంద్రానికి సుమారు 250 కిలోమీటర్లు, హనుమకొండ కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలోని పర్యటక ప్రాంతాలను చూడటానికి విచ్చేయాలని కోరారు. వారందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఎఫ్డిఓ రమేష్, అటవీ శాఖ పోలీసు తదితర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………….

