*ఊటీని తలపించిన నగరం
*ఉదయం పది వరకూ ఇదే పరిస్థితి
ఆకేరున్యూస్, డెస్క్ : గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. ఉదయం 9 గంటలవ వరకు ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన చలికి తోడు ఉదయం వేళ పొగ మంచు తోడైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాలను ఉదయం పది గంటల వరకు మంచుపొగ కమ్మేసింది. పాఠశాలలకు, కళాశాలలకు, ఆఫీసులకు వెళ్లే వారు పొగ మంచు వల్ల ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై ఎదురుగా ఏమీ కన్పించే పరిస్థితి లేదు. ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని స్వల్ప ప్రమాదాలకూ దారితీస్తున్నాయి.కాజీపేట రైల్వేస్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు పొగమంచు కారణంగా సమయానికి ఆటోలు లభించక నానా అవస్థలు పడ్డారు. మరో వైపు పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే పేరెంట్స్ ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించక అవస్థలు పడ్డారు. శనివారం ట్రైసిటీలో వాతావరణం ఊటీని తలపించే విధంగా ఉంది. హన్మ కొండ బస్ స్టాండ్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సులు నడిపే డ్రైవర్లు ఎదురుగా కమ్మేసిన మంచుపొగతో ఇబ్బందులు పడ్డారు. దగ్గరకు వస్తే కాని ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తు పట్టలేని పరిస్థితి ఉంది. కొన్నిరోజులుగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలులతో వాతావరణం చల్లగా మారిపోతోంది. రాబోయే రెండు మూడు రోజులు చలితీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
…………………………………..

