* మూతపడ్డ పరిశ్రమలపై పోలీసుల నిఘా
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
అవి పేరుకు మూతపడ్డ కంపెనీలుగా చెలామణి అవుతున్నాయి. పారిశ్రామికవాడలో దూరంగా తుప్పలు, చెదలతో నిండి ఉంటాయి. కానీ.. అక్కడ గుట్టుగా డ్రగ్స్ తయారీ జరుగుతుందని మీకు తెలుసా? అవును.. అలాంటి ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. దీంతో అలాంటి పరిశ్రమలపై నార్కోటిక్ (ఈగల్) టీమ్, హెచ్‌న్యూ అధికారులు నిఘా పెట్టారు. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనల ఆధారంగా అలాంటి పరిశ్రమలు ఇంకెన్ని, ఎక్కడ ఉన్నాయో ఆరా తీస్తున్నారు.
గతంలో అలా..
గతంలో చర్లపల్లి పారిశ్రామికవాడలో డ్రగ్స్ తయారీ కంపెనీపై ముంబై పోలీసులు దాడి చేసి రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ ముడిసరుకును పట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. హైదరాబాద్‌లోని పారిశ్రామికవాడల్లోని మూతపడ్డ ఫార్మా కంపెనీల్లో తయారవుతున్న మాదకద్రవ్యాలు అంతర్జాతీయ మార్కెట్‌కు తరలిపోతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆ తర్వాత..
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని మరో కంపెనీలో రహస్యంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఎఫిడ్రిన్ డ్రగ్‌ను తయారు చేస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10కోట్ల విలువైన 220 కేజీల ఎఫిడ్రిన్ సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ రెండు ఘటనల్లో రూ. 22 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ గుట్టు రట్టయింది.
న్యూఇయర్‌కు ముందు నుంచే..
మూతపడ్డ పరిశ్రమలపై నిఘా తగ్గడంతో వాటిని స్మగ్లర్లు డ్రగ్స్ తయారీదారులుగా మార్చుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు వాటిపై నిరంతర నిఘా ఉంచినట్లు తెలిసింది. పారిశ్రామికవాడల్లో కొన్ని మూతపడ్డ పరిశ్రమలను, ఖాళీగా ఉన్న షెడ్డులను అడ్డాగా చేసుకుంటున్నారని గుర్తించారు. కొన్నేళ్లుగా న్యూ ఇయర్ వేడుకలకు ముందు సైబరాబాద్, నాచారం, పటాన్‌చెరూ, జిన్నారం పరిధిలో డ్రగ్స్ ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈనేపథ్యంలోనే ఈ ఏడాది న్యూఇయర్‌కు ముందు నుంచే ఆయా కంపెనీలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
……………………………………………………………….

