* నీళ్లకు బదులు నిప్పులు కురిపిస్తున్న కాంగ్రెస్
ఆకేరు న్యూస్, సండే స్పెషల్
తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల చుట్టూ నిప్పులు కురుస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకం, ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల కేటాయింపుల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వ్యాఖ్యలు హీట్ ఎక్కుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడి రాజకీయ కాక పెంచారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి కాంగ్రెస్సే కారణమని, కేంద్రం డీపీఆర్ ను వెనక్కి పంపినా మూసుకుని కూర్చుందని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ఇకపై నుంచి తానే రంగంలోకి దిగుతానని, తాట తీస్తానని హెచ్చరించారు. అప్పటి నుంచి తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కయ్యాయి.
కేసీఆర్ మీడియా సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకుంది. అంతేకాదు.. కేసీఆర్ లేవనెత్తిన ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలకు, మంత్రులకు అవగాహన కల్పించి మరీ ప్రతిపక్షానికి గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో రాజకీయం మరింత పదునెక్కింది. దీనికితోడు కేసీఆర్ సైతం అసెంబ్లీకి హాజరయ్యారు. ఇక ఏముంది.. అసెంబ్లీ దద్దరిల్లిపోతుందని అందరూ భావించారు. నీటి ప్రాజెక్టులు, తెలంగాణ సమస్యలు అన్నింటిపైనా మంచి పట్టున్న కేసీఆర్ తన యాస, భాషతో తనదైన శైలిలో విజృంభిస్తే అధికార పక్షానికి చెమటలు పట్టక తప్పవని అనుకున్నారు. కానీ గులాబీ బాస్ తుస్ మనిపించారు. అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి మాయం అయిపోయారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, తాగునీటిని అందించాలనే లక్ష్యం పేరుతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. పోలవరం డైవర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే 45టీఎంసీలను, మైనర్ ఇరిగేషన్ కింద ట్రిబ్యునల్ కేటాయించిన 89 టీఎంసీల్లో వినియోగించకుండా ఉన్న మరో 45 టీంఎసీలను మొత్తం కలిపి 90టీఎంసీల నికర జలాలను పీఆర్ఎల్ఐఎస్కు కేటాయించింది. ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ జీవో 246ను జారీ చేసింది. ఆ ప్రతిపాదనలతో డీపీఆర్‌ను సమర్పించింది. అయితే.. 2024డిసెంబర్లో ఏకంగా డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపిందని, అది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత అని బీఆర్ ఎస్ విమర్శిస్తోంది.
ఇదే ప్రాజెక్టుపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ సై అంటే… ఇప్పుడు బీఆర్ ఎస్ సమావేశాలను బాయ్ కాట్ చేసింది. కేసీఆర్ వచ్చి వెంటనే వెళ్లిపోతే.., సమావేశాల రెండో రోజే బీఆర్ ఎస్ శాసనసభా పక్షం బాయ్ కాట్ పేరుతో బయటకు వెళ్లిపోయింది. హరీశ్‌రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్న ఒక్కరోజులోనే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సభలో ముఖ్యమంత్రి సహా, మంత్రులు నీటి ప్రాజెక్టుల్లో లోపాల పాపం బీఆర్ ఎస్దే అని చెబుతోంది. పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల వ్యయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పెంచిందని, అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ పాలనలో వాటాను సరిగ్గా వాడుకోలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాదంటే సభకు వచ్చి నిజానిజాలు మాట్లాడాలని సవాల్ విసురుతోంది.
గణాంకాలు, మినిట్స్, జీవోలు అంటూ.. తెలంగాణలో ప్రాజెక్టుల లోగుట్టు ఇదంటూ.. మొత్తం పాపం అంతా నాటి ప్రభుత్వానిదే అని కాంగ్రెస్ అసెంబ్లీలో గడగడలాడిస్తోంది. పాలమూరు రంగారెడ్డిపై బీఆర్ఎస్ మోసం, దగా బీఆర్ ఎస్దే అని పేర్కొంటోంది. సీఎం రేవంత్ రెడ్డి నిన్న రెండు గంటల పాటు అసెంబ్లీ లో అనర్గళంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ను చీల్చి చెండాడారు. సభలో వాయిస్ వన్ సైడ్ కావడంతో ఏది సత్యం.. ఏది అసత్యమో ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఈక్రమంలో అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసి బీఆర్ ఎస్ తప్పు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పార్టీలోనూ అంతర్గత చర్చ జరుగుతోంది.
……………………………………………………………………

