* వ్యక్తిగా వెళ్తున్నాను.. శక్తిగా తిరిగి వస్తా
*ఇదే నా చివరి ప్రసంగం
* నా రాజీనామాను ఆమోదించండి
* శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : త్వరలో నేనంటే ఏంటో నిరూపిస్తాను.. వ్యక్తిగా వెళ్తున్నాను.. శక్తిగా తిరిగి వస్తా అంటూ ఎమ్మెల్సీ కవిత శపథం చేశారు. సోమవారం జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ఇదే తన చివరి ప్రసంగం అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని
స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగా వెళ్లి శక్తిగా తిరిగి వస్తానని ఆమె శపథం చేశారు. బీఆర్ ఎస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలను కవిత వివరించారు. బీఆర్ ఎస్ కింది స్థాయి నాయకుల వ్యవహారంపై ఆమె విరుచుకుపడ్డారు. కిందిస్థాయి నాయకులు చేస్తున్న దురాగతాలను కేసీఆర్ గుర్తించడం లేదన్నారు.బీజేపీ తనను జైలుకు పంపితే.. బీఆర్ఎస్ నాయకులు తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా మూడేళ్లు ఈడీతో తాను పోరాటం చేశానన్నారు.పార్టీ అధినేత కేసీఆర్ను విమర్శిస్తే పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదంటూ కవిత సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ను కాపాడుకోలేని పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అని అన్నారు. హరీష్ రావు అవినీతి పరుడంటూ కవిత ఉద్ఘాటించారు. బీఆర్ ఎస్ పార్టీ పెద్దలకు పార్టీని నడపడం చేత కాదని కవిత విమర్శించారు.నా ఇద్దరి కొడుకుల మీద ఒట్టు వేసి చెప్తోన్న.. బీఆర్ఎస్తో నాది ఆస్తుల పంచాయితీ కాదు.. ఆత్మగౌరవ పంచాయితీ’ అని కవిత స్పష్టం చేశారు.ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించాను. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి. ఉద్యమకారులకు ఆర్థికసాయం చేద్దామంటే నా మాట వినలేదు. ఇసుక దందాల కోసమే నేరెళ్ళ దురాగతం జరిగింది. తెలంగాణ వచ్చాక కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోవటం అవమానకరమన్నారు.
నాపై కక్ష కట్టారు
బీఆర్ ఎస్ నాయకులు తన పై కక్ష కట్టారని కవిత అన్నారు. పార్టీలో ఉన్న అవినీతిని ప్రశ్నించినందుకు తనపై కక్ష కట్టారని ఆమె అన్నారు. ధర్నా చౌక్ ను ఎత్తి వేసి ప్రజాస్వామ్య యుతంగా
ధర్నా చేసుకునే హక్కును లేకుండా చేశారని కవిత విమర్శించారు.పార్టీలో కొంత మంది చేస్తున్న అరాచకాలను కేసీఆర్ దృష్టికి తీసుకుపోయినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారని కవిత విమర్శించారు. తెలంగాణలో ఒరగబెట్టింది ఏమీ లేదు కానీ జాతీయ రాజకీయాలకు పోవాలన్న ఆలోచన చేశారని కవిత అన్నారు. టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చడాన్ని తాను మొదట్లోనే వ్యతిరేకించానని కవిత తెలిపారు. తాను ఏ పని చేసినా అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆలోచన చేస్తానని ఆమె అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అస్కార్ ఫెర్నాండెజ్ తో తనకున్న పరిచయంతోనే సోనియా గాంధీని కలిసే అవకాశం బీఆర్ ఎస్ పెద్దలకు లభించిందని కవిత గుర్తు చేశారు. ఆ తరువాత సోనియా గాంధీ తెలంగాణ విషయంలో సానుకూలంగా స్పందించి రాష్ట్రా ఏర్పాటుకు తోడ్పాటు అందించారని కవిత చెప్పుకొచ్చారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశౄరు. చివరగా ఆమె తన రాజీనామోను ఆమోదించవలసిందిగా శాసనమండలి చైర్మన్ ను కోరారు.

