* రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : అప్పటి వరకు స్నేహితులందరూ పుట్టినరోజు వేడుకల్లో సంతోషంగా పాల్గొన్నారు. ఆడి పాడారు. సరదాలను పంచుకున్నారు. తిరిగి ఇళ్లకు చేరుకునే క్రమంలో అతివేగం వారిని బలి తీసుకుంది. తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లాలో మొకిలా పోలీస్ స్టేషన్ పరిధి మీర్జాగుడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా’ (ICFAI) యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కోకాపేటలో జరిగిన పుట్టినరోజు వేడుక నుంచి తిరిగి వస్తున్నారు. తెల్లవారుజామున వారి కారు మీర్జాగుడాకు చేరుకున్నప్పుడు, అతివేగం కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టును ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జుగా మారింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. చనిపోయిన వారిని సూర్య తేజ, సుమిత్, నిఖిల్, రోహిత్ అని గుర్తించారు. వారితో ఉన్న నక్షత్ర అనే విద్యార్థి తీవ్రంగా గాయపడింది, ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………….

