– భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
ఉపాధ్యాయ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలి జెట్టి లక్ష్మయ్య కన్నుమూశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు జెట్టి లక్ష్మయ్య వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతూ ఉప్పల్ లోనీ స్వగృహంలో గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగించి, స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. 1967 లో ఉపాధ్యాయుడిగా ప్రారంభించి, 2005 లో పదవి విరమణ పొందారు. 38 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించారు. ప్రశంసా పత్రాలు, పాటలు, పద్యాలతో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించారు. పేద విద్యార్థులకు తన వంతుగా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.అనేకమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన కృషికి గాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. ఆయన మృతి పట్ల పూర్వ విద్యార్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఎంపీ ఈటల నివాళి
విశ్రాంత ఉపాధ్యాయుడు జెట్టి లక్ష్మయ్య భౌతిక కాయానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. గురువారం మధ్యాహ్నం జెట్టి లక్ష్మయ్య స్వగృహానికి చేరుకున్న ఈటల ఆయన పార్థీవదేహాన్ని సందర్శించారు. అనంతరం పూలతో నివాళులర్పించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు.

………………………………………………….

