* శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు
* రాష్ట్రమంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు: వన దేవతల ఘన కీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలని,గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గొట్టు గోత్రాలు ఆచారాలు ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతున్నదని,ప్రపంచానికి ఆదివాసులు మూల పురుషులుగా ఉన్నారని, మేడారం అభివృద్ధి పై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.శుక్రవారం ఎస్.ఎస్.తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో ఆమె తో పాటు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, లతో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం 251 కోట్ల రూపాయల నిధులతో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.మేడారం జాతర లో శాశ్వత ప్రతిపాదికన జరుగుతున్నా అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ అంశాలు ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు.భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, ఇంటి ఇలావేల్పులుగా సమ్మక్క సారలమ్మ దేవతలు ప్రసిద్ధి చెందారని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగులలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవ వందనంతో గిరిజన నృత్యాల తో వన దేవతలు గద్దెల పైకి రావడం తో భక్త జనం భక్తి పారవశ్యం తో పులకరిస్తారని పేర్కొన్నారు.ఈ మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.గద్దెల పునరుద్ధరన ముఖ్యమంత్రి చేతుల మీదుగా 19వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని ,18వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారని, గద్దెల పునరుద్ధన ప్రారంభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతర నిర్వహించడం జరుగుతుందని, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.జాతర లో ప్రస్తుతం 5 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని , జాతర సమయం లో 30వేల మంది సిబ్బంది,జాతర అనంతరం 5 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.జాతర ప్రాంతాన్ని 8 జోన్స్ గా, 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్ లో 8 మంది అధికారులు ఉంటారని అన్నారు. జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ మేడారం జాతర సమయంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

