* బారులు తీరుతున్న వాహనాలు
ఆకేరు న్యూస్, ములుగు : ప్రతీ రెండు ఏళ్లకు ఒకసారి జరుపుకునే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క జాతరకు జనం భారీగా తరలి వెళ్తున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జారతకు భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి లక్షల సంఖ్యలో వస్తూంటారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర ఉంటుంది. 28 న సారక్క అమ్మవారు 29 సమ్మక్క అమ్మవారులు గద్దెల మీదకు వస్తారు. రెండు రోజుల తరువాత 31 న తిరిగి వన ప్రవేశం చేస్తారు. ఈ నేపధ్యంలో ఈ నాలుగు రోజులు మేడారం లక్షలాది మంది చేరుకుంటారు. అమ్మవార్లు గద్దెలపై చేరుకున్నప్పుడు దర్శించుకుంటే పణ్యంతోపాటు అనుకున్న పనులు జరుగుతాయని భక్తుల విశ్వాసం..ఇదిలా ఉండగా భక్తుల రద్దీకి భయపడి చాలా మంది భక్తులు ముందుగానే మేడారం దర్శించుకొని వెళ్తూ ఉంటారు. దాదాపు నెల రోజుల మందునుంచే మేడారానికి భక్తుల తాకిడి ఉంటుంది. కాగా పది రోజుల ముందు నుంచి ఇంకా భక్తుల సంఖ్య పెరిగింది.ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారి రోడ్డుపై వాహనాలు బారులు తీరు ప్రయాణిస్తున్నాయి. వివిధ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలనుంచి కూడా భక్తులు మేడారం చేరుకుంటున్నారు.వరుస సంక్రాంతి సెలవులు రావడంతో మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అమ్మవార్లకు ముందుస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్న వాగులో ఇరువైపులా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో సమ్మక్క దేవత గద్దె వద్ద భక్త జన సందోహం నెలకొన్నది. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో పస్రా- మేడారం వద్ద వాహనాల రద్దీ నెలకొంది. కాగా, ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు మేడారాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై సమీక్షనుంచనున్నారు.
……………………………………………….

