* టెక్స్టైల్ పరిశ్రమల్లో శ్రమదోపిడీ
* మాజీ ఎంపీ వినోద్ కుమార్
ఆకేరు న్యూస్, హనుమకొండ : మనిషి ఉన్నంత వరకు కార్మిక చట్టాలు అవసరం.. కానీ నేటి పరిస్థితుల్లో కార్మిక చట్టాలు యాజమాన్యాలకు చుట్టాలుగా మారాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ కార్మిక హక్కుల సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్టరీలు మరియు టెక్స్టైల్ పరిశ్రమల్లో కార్మికుల దోపిడీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అన్నారు.
గతంలో వారానికి 6 రోజులు, రోజుకు 8 గంటల చొప్పున 48 గంటలు పనిచేసే విధానం ఉండేదన్నారు. అదనపు సమయం పనిచేస్తే ‘ఓవర్ టైం’ (OT) వేతనం లభించేదని వినోద్ కుమార్ అన్నారు.. కానీ ప్రస్తుత యాజమాన్యాలు కొత్త మార్పులు చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. .సోమ, మంగళవారాల్లోనే రోజుకు 12 గంటల చొప్పున పనిచేయించుకుంటున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 48 గంటల పని పూర్తి చేయించుకుని, మిగిలిన రోజుల్లో పని లేదని పంపించేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీనివల్ల 12 గంటలు కష్టపడినా కార్మికులకు కేవలం సాధారణ వేతనమే దక్కుతోందన్నారు, రావాల్సిన OT వేతనాన్ని కార్మికులు పూర్తిగా కోల్పోతున్నారని ఆయన తెలిపారు. జిల్లాలోని గ్రానైట్ మరియు చిన్న తరహా టెక్స్టైల్ రంగాల్లో యజమానులకు అపరిమిత అధికారాలు ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయన్నారు.నచ్చిన వారిని ఉంచుకోవడం, నచ్చని వారిని ఏ క్షణమైనా తొలగించే అవకాశం ఉంటుందన్నారు. 300 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉంటేనే రిట్రెంచ్మెంట్ నిబంధనలు కఠినంగా వర్తిస్తాయి, కానీ ఇక్కడ అటువంటి పెద్ద ఫ్యాక్టరీలు లేకపోవడం యజమానులకు వరంగా మారిందన్నారు.నూతన కార్మిక కోడ్ల పేరుతో జరుగుతున్న మార్పులు శ్రామిక వర్గాన్ని దెబ్బ తీస్తున్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఒకప్పుడు 8 గంటల పని దినం కోసం చేసిన చారిత్రాత్మక పోరాటాల ఫలితం నేడు కనుమరుగవుతోందని వాపోయారు. లేబర్ కోర్టులను ఆశ్రయించినా, చట్టాలు ఇలాగే ఉన్నాయి.. మేము కూడా ఏమీ చేయలేము అని జడ్జీలు అనడం వల్ల కార్మికులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. చట్టాలు అనేవి కార్మికులకు రక్షణ కవచంలా ఉండాలి తప్ప, వారిని ఇబ్బందులకు గురిచేసేలా ఉండకూడదని వినోద్ కుమార్ అన్నారు.
………………………………………

