* టీవీకే పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయింపు!
ఆకేరు న్యూస్ , డెస్క్: తమిళనాడు అసెంబ్లీలో కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో విజయ్ ప్రారంభించిన “తమిళగ వెట్రి కళగం” పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది.విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో మరో అడుగు వేశారు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(TVK)పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ‘విజిల్’గుర్తును కేటాయించింది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం వెలువడింది.విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘బిగిల్’. తెలుగులో ఈ సినిమా ‘విజిల్’ పేరుతోనే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే పేరున్న గుర్తును ఎన్నికల గుర్తుగా పొందడం విజయ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.విజయ్ పార్టీతో పాటు నటుడు కమల్ హాసన్ “మక్కల్ నీది మయ్యం” పార్టీకి కూడా ఎన్నికల సంఘం ‘బ్యాటరీ టార్చ్’ గుర్తును కేటాయించింది.నవంబర్ 11వ తేదీన టీవీకే పార్టీ తమకు ఎన్నికల గుర్తును కేటాయించాలని కోరుతూ ఈసీని ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందని పార్టీలు తమకు నచ్చిన గుర్తు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించిన నేపథ్యంలో, విజయ్ పార్టీ తాము అనుకున్న గుర్తును దక్కించుకోగలిగింది.2019 లోక్సభ ఎన్నికలు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో MNM బ్యాటరీ టార్చ్ గుర్తుపైన పోటీ చేసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కీలకం కాబోతున్నారు. ఆయనకు, ఇప్పుడు సొంత గుర్తు రావడంతో ప్రచార పర్వం మరింత వేగవంతం కానుంది. ‘విజిల్’ గుర్తు సామాన్య ప్రజల్లోకి సులభంగా వెళ్తుందనేది పార్టీ వర్గాల నమ్మకం.తమ అభిమాన హీరోకి ఆయన సినిమా పేరు మీదే గుర్తు రావడంతో సోషల్ మీడియాలో ‘విజిల్’ హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి.
………………………………………
