ఆకేరు న్యూస్, వరంగల్:వరంగల్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వ్యక్తులపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉక్కుపాదం మోపారు. మిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ అలియాస్ కోతి సురేష్ ను ఆరు నెలల పాటు వరంగల్ కమిషనరేట్ పరిధి నుండి బహిష్కరిస్తూ సీపీ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్న సురేష్‌పై గతంలో అనేక తీవ్రమైన నేర కేసులు నమోదయ్యాయి. ఇతని అక్రమ కార్యకలాపాల కారణంగా ప్రజలు ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రజలు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి నెలకొందని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.ఈ క్రమంలో తన ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, సురేష్ అధికారుల ముందు హాజరుకాకపోవడంతో పాటు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో, అతడిని నగరం నుండి బహిష్కరించాలని నిర్ణయించారు.సీపీ ఉత్తర్వుల అనంతరం మిల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ రమేష్, ఎస్.ఐ మిథున్ ఆధ్వర్యంలో సురేష్‌ను కమిషనరేట్ సరిహద్దు వరకు తీసుకెళ్లి ఉత్తర్వుల కాపీని అందజేశారు. కోర్టు వాయిదాల కోసం మాత్రమే ముందస్తు అనుమతితో నగరంలోకి ప్రవేశించేందుకు వీలుంటుందని అధికారులు స్పష్టం చేశారు. నగరంలో శాంతిభద్రతలకు హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని, ప్రజలు ఎవరు కూడా భయపడకుండా నేరస్థుల సమాచారాన్ని పోలీసులకు అందించాలి అని సన్ ప్రీత్ సింగ్ అన్నారు.
…………………………………………………….
